హైదరాబాద్‌ టు సొంతూరు.. ప్రియురాలిని వదిలి అమ్మ ఒడికి..?

మళ్లీ ఎడబాటు కాలం వచ్చేసింది.. ప్రియురాలికి ప్రియుడితో ఎడబాటు సమయం వచ్చేసింది.. ఏడాదంతా ప్రియురాలితోనే హాయిగా గడిపే ఆ ప్రియుడు.. ఇప్పుడు కొన్నిరోజులు అమ్మ ఒడిలో సేదతీరేందుకు వెళ్తున్నాడు. ఇంతకీ ఈ ప్రియురాలు.. ప్రియుడు ఎవరో తెలుసా.. ఆ ప్రియురాలు హైదరాబాద్.. ప్రియుడు పల్లెటూరు మూలాలు ఉన్న భాగ్యనగరవాసి. తెలుగు రాష్ట్రాల్లోని నలు మూలల నుంచి అనేక కారణాలతో హైదరాబాద్‌ చేరి అక్కడే స్థిరపడిపోయిన ప్రతి తెలుగువాడూ.. ఈ సంక్రాంతి సమయంలో మాత్రం సొంత ఊరి వైపు చూస్తాడు.

సంక్రాంతి పండుగను తాను పుట్టిన ఊళ్లో జరుపుకోవాలని ప్రయత్నిస్తాడు. అందుకు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటాడు.. ఇక హైదరాబాద్‌ అనే ప్రేయసికి.. ఏటా కొన్నిరోజులు ఈ ఎడబాటు తప్పదు.. ప్రతి ఏటా సంక్రాంతి వేళ తనను విడిచిపోతున్న ప్రియుడిని చూసి కాస్త బెంగపెట్టుకున్నా.. నాలుగురోజులేగా నా దగ్గరకు రాకుండా ఎక్కడికిపోతాడులే అని కాస్త బెంగతోనే సాగనంపుతుంది. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఏమూల చూసినా ఇదే దృశ్యం కనిపిస్తోంది.

హైదరాబాద్ నుంచి సంక్రాంతికి సొంతూళ్లకు జనం పయనమవుతున్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్ వంటి బ‌స్‌ స్టేషన్లే కాదు.. ఉప్పల్, ఎల్బీనగర్ వంటి జంక్షన్లు.. సంక్రాంతికి ఇళ్లకు వెళ్లే ప్రయాణికులతో రద్దీగా మారుతున్నాయి. అటు బీహెచ్‌ఈఎల్ నుంచి ఇటు వనస్థలిపురం వరకూ.. మరోవైపు జీడిమెట్ల నుంచి చార్మినార్‌ వరకూ.. ఇలా భాగ్యనగరం నలమూలలా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీతో ఈ ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.

ఇక సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అయితే.. ప్రయాణికులు బారులు తీరారు. అధికారులు క్యూలైన్ల ద్వారా రైల్వే స్టేషన్‌లోకి అనుమతిస్తున్నారు. మాస్కులు లేని ప్రయాణికులకు జరిమానా వేస్తున్న రైల్వే పోలీసులు.. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఓ నాలుగు రోజులు సొంత ఊళ్లో గడిపివచ్చే తెలుగు బిడ్డ.. మళ్లీ ఏడాది వరకూ ఆ జ్ఞాపకాలతో బతికేస్తాడు.. మళ్లీ వచ్చే సంక్రాంతి కోసం ఎదురు చూస్తాడు. ప్రియురాలి హైదరాబాద్‌కు మాత్రం ఏటా ఈ విరహం మాత్రం తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: