హైదరాబాద్‌లో ముగ్గురు సీఎంలు..! భలే పంచాయతీ..?

హైదరాబాద్‌లో శనివారం ముగ్గురు సీఎంలు ఉన్నారు.. ఈ ముగ్గురు సీఎంల మధ్య సాగిన రాజకీయం భలే రంజుగా ఉంది. ఇంతకీ ఆ ముగ్గురు సీఎంలు ఎవరో ముందు చెప్పుకుందాం.. ఎలాగూ హైదరాబాద్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఉంటారు. ఇక రెండో సీఎం కేరళ సీఎం పినరయి విజయన్. ఆయన హైదరాబాద్‌లో సీపీఎం పార్టీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చారు. ఎలాగూ వచ్చాం కదా అని పనిలో పనిగా కేసీఆర్‌ను కూడా కలిశారు.

కొన్ని నెలల క్రితం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ హంగామా చేశారు కదా. అది గుర్తొచ్చి ఉంటుంది పినరయి విజయన్‌కు.. అందుకే ఆయన కేసీఆర్‌తో భేటీకి ఆసక్తి చూపారు. కేసీఆర్ కూడా ఈ సీపీఎం నేతలకు తన ప్రగతిభవన్‌లోని నివాసానికి ఆత్మీయంగా ఆహ్వానించి అతిథి సత్కారాలు కావించారు. ఇద్దరు సీఎంలు కాసేపు దేశ రాజకీయాలు మాట్లాడుకున్నారట. కేసీఆర్‌తో సమావేశం చాలా ఫలప్రదంగా జరిగిందని సమావేశం తర్వాత పినరయి విజయన్ తన సోషల్ మీడియా వేదికలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

అంతా బాగానే ఉంది ఇంకేటి గొడవ అంటారా.. అక్కడే వచ్చింది చిక్కు. మనం మూడో సీఎం గురించి కూడా చెప్పుకోవాలి కదా.. ఆ మూడో సీఎం మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్.. ఇటీవల హైదరాబాద్ లో ఆర్ఎస్‌ ఎస్‌ సమావేశాలు జరుగుతున్నాయి కదా.. వాటిలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు శివరాజ్‌ సింగ్ చౌహాన్.. ఎలాగ వచ్చాం కదా.. పనిలో పనిగా మన బండి సంజయ్‌కు కాస్త గట్టిగా సపోర్ట్ చేద్దామని భావించినట్టున్నారు. అందుకే కేసీఆర్‌పై ఘాటుగా విమర్శలు చేశారు.

దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ మంత్రులు సదరు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ పై మండిపడుతున్నారు. దొడ్డిదారిన శివరాజ్‌సింగ్ చౌహాన్ సీఎం అయ్యారని.. అసలు సీఎం కేసీఆర్‌కు శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు పోలికే లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రజలే అధిష్ఠానంగా కేసీఆర్ సీఎం అయ్యారని.. గతంలో ప్రధాని, బీజేపీ సీఎంలు.. కేసీఆర్‌ను ప్రశంసించలేదా? అని గుర్తు చేస్తున్నారు. అంతేలే.. ఇక్కడ ముగ్గురు సీఎంలలో ఎవరి రాజకీయాలు వాళ్లవి. అంతేగా..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: