ఏపీ, తెలంగాణ‌ల్లో ముంద‌స్తు ఎన్నిక‌లు ఖాయ‌మేనా..?

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ‌లో బీజేపీ నేత‌లు ఉన్న‌ట్టుండి జోరు పెంచి రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై పోరుబాట ప‌ట్ట‌డం తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా స్వ‌యంగా హైద‌రాబాద్ వ‌చ్చి టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై మంగ‌ళ‌వారం ప‌దునైన విమ‌ర్శ‌లు చేశారు. ఇక ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ త‌న‌ను అరెస్టు చేసిన ఉదంత‌పై ఇప్ప‌టికే లోక్ స‌భ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచార‌ణ‌కు స్పీక‌ర్ ఆదేశించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ స్థాయిలో బీజేపీ దూకుడుకు కార‌ణాలేమిట‌నే అంశంపై విస్తృత స్థాయిలో రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఈ రెండు రాష్ట్రాల్లోనూ ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని, ఈ విష‌యంపై స్పష్ట‌మైన అంచ‌నా, అవ‌గాహ‌న ఉండ‌టంతోనే బీజేపీ త‌న శ్రేణుల‌ను ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా సిద్దం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌న్న అభిప్రాయాలు తాజాగా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై మంగ‌ళ‌వారం బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా చేసిన విమ‌ర్శ‌లు, అవినీతి ఆరోప‌ణ‌ల స్థాయి తక్కువేమీ కాదు. తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన‌ మిష‌న్ భ‌గీర‌థ‌, కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ లు ప్ర‌భుత్వ అవినీతిలో భాగ‌మ‌ని, కాళేశ్వ‌రం ప్రాజెక్టు అంచ‌నాలు రూ.36 వేల కోట్ల‌నుంచి రూ.1.20 ల‌క్ష‌ల కోట్ల‌కు పెంచి దాన్నో ఏటీఎం లా మార్చుకున్నార‌ని బీజేపీ నేత ఘాటుగా విమ‌ర్శ‌లు చేశారు.
నిజానికి తెలంగాణ‌లో తాము చేప‌ట్టిన తాగునీటి ప్రాజెక్టుల‌నే టీఆర్ఎస్ ప్ర‌భుత్వం గొప్ప విజ‌యంగా త‌మ ప్ర‌చారాస్త్రంగా చేసుకుని గ‌త ఎన్నిక‌ల్లో భారీగా ల‌బ్ది పొందింది. సంక్షేమ కార్య‌క్ర‌మాలు కూడా కొన్ని ఓట్లు రాల్చి ఉండొచ్చు.  కానీ ప్ర‌ధానంగా ప్రాజెక్టులు క‌ట్టి, బీడువారిన తెలంగాణ భూముల‌కు నీళ్లివ్వ‌డం అనేది ఒక ఉద్వేగ భరిత అంశంగా మ‌లచుకోవ‌డంలో కేసీఆర్ స‌క్సెస్ అయ్యారు. అందుకేనేమో ఇప్పుడు బీజేపీ వాటిపైనే గురిపెట్టింది. ఈ ప్రాజెక్టుల్లో అవినీతి జ‌రిగింద‌ని గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపణ‌లు గుప్పించినా.. ఆ వాద‌న‌ను టీఆర్ఎస్ గ‌ట్టిగా తిప్పికొట్టింది. అర‌వై ఏళ్లుగా కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు తెలంగాణ‌ను మోసం చేస్తూ వ‌చ్చాయ‌ని, వారు చేయ‌లేనిది తాము చేసినందుకే అస‌త్య ఆరోప‌ణ‌ల‌నీ కొట్టిపారేసింది. ప్ర‌జ‌లు కూడా టీఆర్ఎస్ మాట‌ల‌నే న‌మ్మార‌ని నాటి ఎన్నిక‌ల ఫ‌లితాలు తేల్చి చెప్పాయి. మ‌రిప్పుడు బీజేపీ ఆరోప‌ణ‌ల‌పై కేసీఆర్ ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక 2018లో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లి ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు ఊపిరి పీల్చుకునే అవ‌కాశం ఇవ్వ‌కుండా చేసిన కేసీఆర్ మ‌రోసారి అలాగే చేసే అవ‌కాశం ఉంద‌ని బీజేపీ అంచ‌నా వేస్తోంది. ఇక ఏపీలో సైతం వైసీపీ ప్ర‌భుత్వం స్వీయ త‌ప్పిదాల‌కు తోడు, కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రితో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని పాలించ‌డానికి నానా ఇక్క‌ట్లు ప‌డుతోంది. దీంతో ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠ నానాటికీ ప‌లుచ‌న‌వుతోంద‌న్న భ‌యంతో పాటు, కోర్టు కేసుల ముప్పు కూడా ఉండ‌టంతో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం కోసం చూస్తోంద‌న్న‌ది బీజేపీ ఆలోచ‌న‌. ఈ నేప‌థ్యంలోనే టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా ఎన్నిక‌ల‌కు తామూ సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: