టార్గెట్‌ 2024: చంద్రబాబు పని మొదలెట్టాడుగా..?

చంద్రబాబు.. దేశంలోనే మోస్ట్ సీనియర్ పొలిటీషియన్‌గా పేరున్న వ్యక్తి.. అప్పుడప్పుడు ఆయన వ్యూహాలు గురితప్పవచ్చేమో కానీ..సీరియస్ పొలిటీషియన్ ఆయన. అందులోనూ ఆయన ఓ ప్రాంతీయ పార్టీ యజమాని.. ప్రాంతీయ పార్టీల్లో నాయకుడే కింగ్.. అలాగే ఆ నాయకుడు వీక్ అయితే ఆ పార్టీ మనుగడే ప్రమాదంలో పడే ప్రమాదం ఉటుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. తెలుగు దేశం పార్టీ అధికారానికి దూరమైంది. చంద్రబాబు కుమారుడు లోకేశ్ రాజకీయాల్లో అంతగా క్లిక్ కావడం లేదు.

ఈ పరిస్థితుల్లో వచ్చే 2024 ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే.. ఇక ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే చంద్రబాబుకు వయస్సు మీద పడుతోంది. ఈసారి అధికారం చేతికి అందకపోతే.. మళ్లీ 2029 వరకూ పార్టీని నిలబెట్టే అంత ఓపిక ఆయనకు లేకపోవచ్చు. అందుకే వచ్చే 2024 ఎన్నికలు చంద్రబాబుకు చావోరేవో అన్న రేంజ్‌లో తయారయ్యాయి. అందుకే చంద్రబాబు తన రాజకీయ చాణక్యం అంతా కూడగట్టుకుంటున్నారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీని సమాయత్తం చేస్తున్నారు.

ఇంకా ఎన్నికలకు దాదాపు రెండేళ్ల సమయం ఉంది. చివరి ఏడాది అంతా ఎన్నికల హడావిడి ఉంటుంది. ఈ ఏడాది రాజకీయంగా నిలదొక్కుకుంటే.. జగన్ పై పైచేయి సాధిస్తే.. ఎన్నికల ఏడాదిని కూడా తనవైపు తిప్పుకోవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన పార్టీ శ్రేణులతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ  కేంద్ర కార్యాలయంలో రెండ్రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి.

జగన్ సర్కారు అనుసరిస్తున్న ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణుల సన్నద్ధం కావాలని చంద్రబాబు పిలుపు ఇస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు అనుగుణంగా చంద్రబాబు వ్యూహం రచిస్తున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు కార్యాచరణ తయారు చేస్తూనే ముందస్తు ఎన్నికలు వచ్చినా ఇబ్బంది లేకుండా పార్టీని సిద్ధం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: