అయ్యో రఘురామా: శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందే..?

ఏపీ రాజకీయాల‌లో రఘురామ కృష్ణంరాజు ఓ విచిత్రమైన క్యారెక్టర్‌.. ఆయన బేసిక్‌గా పారిశ్రామిక వేత్త.. ఆగర్భ శ్రీమంతుడు.. వందల కోట్ల ఆస్తులు ఉన్నవాడు.. అంతే కాదు.. రాజకీయాలతో సంబంధం లేకుండా ఢిల్లీలో అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నవాడు.. ప్రధాని మోడీ, అమిత్‌ షా వంటి వారి అపాయింట్‌మెంట్‌ తరచూ సంపాదించగలిగినంత పరపతి ఉన్నవాడు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచినా.. కొద్దిరోజుల్లోనే ఆ పార్టీకి దూరమైనవాడు.

ప్రస్తుతం టెక్నికల్‌గా ఆయన వైసీపీ ఎంపీయే అయినా.. వాస్తవానికి యాంటీ వైసీపీ ఎంపీ.. జగన్‌ సర్కారుపై విమర్శలు చేయడంలో కాస్త టీడీపీ అయినా వెనుకబడుతుందేమో కానీ.. రఘురామ కృష్ణంరాజుమాత్రం ఏమాత్రం వెనుకంజవేయరు.. అంతే కాదు.. కొన్నాళ్లుగా ఢిల్లీలో దాదాపు ప్రతి రోజూ ప్రెస్‌ మీట్ నిర్వహిస్తున్న ఏకైక ఎంపీ రఘురామ కృష్ణంరాజే కావచ్చు.. జగన్ సర్కారు చేస్తున్న తప్పుడు పనులు అన్నింటినీ ఆయన తన ప్రెస్ మీట్లలో తూర్పారపడుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. రఘురామ కృష్ణంరాజు వైసీపీకి కొరకరాని కొయ్యగా మారారు.

అయితే.. అలాంటి రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు స్వయంగా ఇబ్బందుల్లో పడ్డారు. ఏకంగా 950 కోట్లు రుణం తీసుకుని ఎగవేసిన కేసులో ఆయనపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఆ చార్జిషీటులో ఆయన ఎలా తప్పులు చేసిందీ వివరంగా వివరించింది. అయితే ఇది ఆయనకు కొత్త వ్యవహారం ఏమీ కాదు.. ఆయన పెద్దగా దీనిపై షాకయ్యేదీ ఏమీ ఉండకపోవచ్చు. కానీ.. రోజూ జగన్ సర్కారు తప్పులుపై విమర్శలు చేసే రఘురామ కృష్ణంరాజు ఇకపై అంత నిర్భయంగా ఆత్మవిశ్వాసంతో ప్రెస్ మీట్లు పెడతారా.. అన్నది చూడాలి.

అలాగే తప్పులెన్నువారు తమ తప్పులెరగరు అన్నది పాత్ర సూత్రం.. తప్పులున్నవారు.. తమ తప్పులు ఒప్పరు అన్నది నేటి సూత్రంగా చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు ఈ సీబీఐ చార్జిషీటు అంశంపై వైసీపీ నేతలకు అస్త్రంగా మారొచ్చు.. దీనిపై ఆయన్ను వైసీపీ ఎంపీలు నిలదీయొచ్చు.. అయినా ఏం నిలదీస్తారులెండి.. సీబీఐ చార్జిషీట్లు వైసీపీ అధినేతకు మాత్రం కొత్తా అని అనుకోవచ్చు. ఏదేమైనా శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్టుగానే ఉంది ఈ రఘురామ వ్యవహారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: