హ్యాపీ న్యూ ఇయ‌ర్ 2022 : ఇంకేం చేస్తాం ఎడ్జ‌స్ట్ అవుతాం...కొత్త ఏడాది కొత్త ప్రేమ

RATNA KISHORE
మ‌నుషుల్లో అంత‌రాలు తొల‌గించే ప్ర‌య‌త్నం ఒక‌టి కాలం చేస్తుంద‌ని విన్నాను. కాలం ప‌ని కూడా మ‌నిషే చేయాలి. కానీ అదే ఈ కాల మ‌హిమ అని స‌ర్దుకుపోవాలి. మ‌నుషుల్లో ప్రేమ,ద్వేషం అన్న‌వి మారిపోతూ ఉంటాయి..కొన్ని ఎక్కువ,కొన్ని త‌క్కువ భావోద్వేగాల కార‌ణంగానే మ‌నుషులు త‌మ‌ని తాము ప్రేమించుకోవ‌డం త‌మ నుంచి తాము వేరు అయి ఇత‌రుల‌ను ద్వేషించ‌డం అన్న‌వి చేస్తారు. అయినా మ‌నిషి క‌దా! ఎన్నో వికృతాల్లో ఉంది ఆఖ‌రికి ఏదో ఒక తీరం ద‌గ్గ‌ర ఆగిపోతాడు.


ఆగిపోయిన తీరం జ‌డ‌త్వానికి సంకేతం అయితే అదొక నిరర్థ‌కం. చైత‌న్యానికి స్థావ‌రం అయితే ఆ జీవిత‌మే ఓ చ‌రిత్ర..మ‌నకు మ‌హాత్ముడు అక్క‌డ నుంచే వ‌స్తాడు..కొత్త జీవితం ఒక‌టి కొత్త అర్థం ఒక‌టి చెప్పి వెళ్తాడు. స‌ముద్ర‌పు గాలులు నా దేహానికి ప‌డుకున్నా జీవితం కోరే మార్పు ద‌గ్గ‌ర అవ‌న్నీ నాలో ప్రేమ‌ను పెంచే వెళ్లాయి అంటాడు..ఓ చోట ఓ ర‌చ‌యిత.. అలానే గాలులు విజృంభిస్తాయి.. గాలులే కొత్త మార్పును  తీసుకువ‌చ్చి  ప్ర‌త్యేక స్థాయిలో మ‌నిషిని మార్చి ఉంచుతాయి. తుఫాను చిత్తాల చెంత మ‌నిషి పొందే ఏ ప‌రివ‌ర్త‌న‌నూ అర్థం చేసుకోక ఉండిపోవ‌డం ఎంత త‌ప్పు! తుఫాను గాలుల చెంత చేరిన కొన్ని అనివార్య నిశ్శ‌బ్దాల‌ను ఛేదించి ప్ర‌యాణించ‌డం ఎంత క‌ష్టం.. అయినా మ‌నం విల‌యాల‌ను సైతం ప్రేమించాలి. విల‌యాకు కార‌ణం అయిన ప్ర‌కృతి పున‌ర్నిర్మాణాన్నీ ప్రేమించాలి.. ఏ విల‌యం అయినా ఓ కొత్త నిర్మాణానికి సంకేతం క‌నుక ఒక విచ్ఛేద‌న ద‌గ్గ‌ర ఆలోచ‌న ఉంటే మంచిది.


విచ్ఛేద‌కాల‌ను నిలువ‌రించే శ‌క్తి ఈ శాస్త్ర సాంకేతిక రంగం ప్రేమ పూర్వ‌కంగా పొంది ఉంటే.. విల‌యాలు ఆగి కొత్త  జీవితాల ఆరంభం సాధ్యం అవుతుంది. కొత్త తీరాల నిర్మాణం సులువు అవుతుంది. కొత్త ఏడాది కొత్త ప్రేమ కొత్త ఆచ్ఛాద‌న అన్న‌వి త‌ప్ప‌క లోప‌లి మ‌నిషికి మాత్ర‌మే కావాలి... అటువంటి కాలానికి స్వాగ‌తం.


మంచు సోన‌ల్లో క‌రిగిపోయిన కాలాన్ని కొత్త‌గా నిర్ణ‌యించే శ‌క్తి మ‌నిషికే ఉంది. కాలం మ‌నిషి నిర్దేశితం.. ప్రేమ మ‌నసు నిర్దేశితం.. మ‌నిషి పొందే ప‌రివ‌ర్త‌న‌ల్లో కాలం ఓ గొప్ప సాక్షి అవుతుంది. అంటే ప్రపంచాన్ని మార్చే శ‌క్తి ప్రేమ నుంచి ప్రేమ వ‌ర‌కూ ఉంటుంది. మార్పు ఉత్ప‌రివ‌ర్త‌నం కాదు అదొక ఉత్పాతం కూడా కావొచ్చు.. చెడును స‌మాధి చేసేందుకు చేసే మార్పు ఉత్ప‌రివ‌ర్త‌నం కాదు ఉత్పాతం అవుతుంది.. ప్రేమ అందుకు ఓ కార‌ణం అవుతుంది. స‌మాజాన్ని న‌డిపే ప్రేమ.. బాధ్య‌త‌ను చెప్పే ప్రేమ.. న‌డ‌వ‌డి దిద్దే ప్రేమ..


ఏడాది అంతా ప్రేమ(లో)ఉండాలి.. ఏడాది అంతా న‌డిపే ప్రేమ.. ఏడాదిని మార్చాలి అనుకునే ప్రేమ.. కాలాన్నే జ‌యించే ప్రేమ‌.. త్రికాల సంధ్య‌ల్లో గెలిచి నిలిచిన ప్రేమ ఒక‌టి త‌ప్ప‌క ఉండాలి. త‌ప్పక ఆనందానుభ‌వానికి అదొక మార్గం కావాలి.. ప్రాతిప‌దిక కావాలి.. ప్రేమ అంటే బాధ్య‌త అని అర్థం. జ్యోతిష్యం చెప్పేట‌టువంటి బాధ్య‌త కాదు.. మ‌నిషి చెప్పేట‌టువంటి బాధ్య‌త.. మ‌నిషిని మ‌నిషిగా ప్రేమించే బాధ్య‌త ద‌గ్గ‌ర అంతా పెద్ద‌వాళ్లం కావాలి. పెద్ద దిక్కు ఒక‌టి వెతుక్కోవాలి. అందుకు త‌గ్గ ప్ర‌య‌త్న‌మేదో చేయాలి.
- ఆనంద‌క‌ర ఏడాదికి స్వాగ‌తం అంద‌రికీ శుభాకాంక్ష‌లు
ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: