పోల‌వ‌రం ప‌రిహారం మ‌రింత భారం కానుందా..?

          విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌రంగా, అభివృద్ధికి ఊతంగా నిలుస్తుంద‌ని ప్ర‌జ‌లు ఎన్నో ఆశ‌లు పెంచుకున్న‌పోల‌వ‌రం మూడొంతుల నిర్మాణం పూర్తి చేసుకుని చాలా రోజులే అయింది. అయితే ఇది పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకుని ఎప్ప‌టికీ అందుబాటులోకి వ‌స్తుంద‌న్న‌ది ప్ర‌భుత్వ వ‌ర్గాల‌తో సహా ఎవ‌రూ ఇప్ప‌టికీ చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇది నిజంగా దుర‌దృష్ట‌క‌ర‌మేన‌ని చెప్పాలి. కేంద్ర ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగా, రాష్ట్ర ప్ర‌భుత్వం అవ‌గాహ‌నా రాహిత్యంతో చేసిన త‌ప్పిదాల కార‌ణంగా పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితుల పున‌రావాస ప్యాకేజీ భారం రాష్ట్రం పైనే అధికంగా ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. దీనితో  ఈ ప్రాజెక్టు ఈ స‌మ‌స్య‌ల‌నుంచి బ‌య‌ట‌ప‌డేదెప్పుడో తెలియ‌డం లేదు.
 
        పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం చేయాల‌న్న ఆలోచ‌న ఇప్ప‌టిది కాదు. ఎప్పుడో బ్రిటిష్ హ‌యాంలోనే 1941లో దీనిగురించి ఆలోచ‌న చేశారు. ఆరేళ్ల‌పాటు అధ్య‌య‌నం చేసి నిర్మాణానికి రూ. 129 కోట్ల వ్య‌యం అవుతుంద‌ని అంచ‌నా వేశారు. ఆ త‌రువాత 33 ఏళ్ల‌కు అంజ‌య్య ముఖ్య‌మంత్రిగా ఉండ‌గా దీనికి పునాది రాయి వేశారు. అయితే దీని నిర్మాణానికి చిత్త‌శుద్దితో కృషిచేసి భూమి పూజ చేసింది మాత్రం 2004లో నాటి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి. అప్ప‌ట్లో దీని నిర్మాణానికి రూ. 8,261 కోట్లు వ్య‌య‌మ‌వుతుంద‌ని అంచ‌నా వేశారు. భూ సేక‌ర‌ణ జ‌రిపి కాలువ‌ల నిర్మాణం చేప‌ట్టారు. అయితే పూర్తిస్థాయి అనుమ‌తులు రాక‌పోవ‌డంతో ప్రాజెక్టు నిర్మాణం మాత్రం ముందుకుసాగ‌లేదు. ఆ త‌రువాత రాష్ట్ర విభ‌జ‌న జ‌ర‌గ‌డంతో పోల‌వ‌రంను జాతీయ ప్రాజెక్టుగా ప్ర‌క‌టించి కేంద్రం నిర్మించేలా విభ‌జ‌న హామీల్లో ప్ర‌క‌టించారు. 2017-18నాటికి నిర్మాణ వ్య‌యం అంచ‌నాలు రూ. 47,726 కోట్ల‌కు పెరిగాయి. ఇందులో 960 మెగావాట్ల హైడ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణ వ్య‌యం కూడా క‌లిపి ఉంది.
         ఇందులో పున‌రావాస ప్యాకేజీ కింద వ్య‌యం చేయాల్సిందే రూ. 29,000 కోట్లుగా ప్ర‌భుత్వం తెలిపింది. 135 అడుగుల ఎత్తులో నిర్మాణ‌మ‌య్యే  ప్రాజెక్టు లైవ్ స్టోరేజ్ 75.2 టీఎంసీలు కాగా, పూర్తి నీటి నిల్వ సామ‌ర్థ్యం 194 టీఎంసీలు. 2018లో ఈ అంచనాలు 58,319కు పెర‌గ్గా వాటికి కేంద్రం నుంచి అనుమ‌తి కూడా ల‌భించింది. గ‌త  ప్ర‌భుత్వ హయాంలో ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జ‌రిగింది. 2019లో రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారాక రివ‌ర్స్ టెండ‌ర్ల పేరుతో కాంట్రాక్టు సంస్థ‌ల‌ను మార్చి వేరే కాంట్రాక్ట‌ర్ల‌కు ప్రాజెక్టు నిర్మాణాన్ని అప్ప‌గించింది. అయితే కేంద్రం మాత్రం ఇప్పుడు పున‌రావాస వ్య‌యంతో త‌మ‌కు సంబంధం లేద‌ని, నిర్మాణ వ్య‌యం మాత్ర‌మే తాము చెల్లిస్తామ‌ని ఇప్పటికే చెల్లించిన మొత్తం మిన‌హా మిగిలింది ఇస్తామ‌ని తేల్చి చెప్పేయ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం దిక్కుతోచ‌ని ప‌రిస్థితిలో ప‌డింది. ఇప్ప‌టికే ఆర్థికంగా ఉన్న రాష్ట్రం నిర్వాసితుల‌కు న‌ష్ట‌ప‌రిహార బాధ్య‌త‌ను త‌ల‌కెత్తుకోవాల్సిరావ‌డమంటే మూలిగే న‌క్క‌పై తాటిపండు చంద‌మేన‌ని చెప్పాలి. లేట‌య్యేకొద్దీ ఈ భారం మ‌రింత పెరిగే ప్ర‌మాదం కూడా పొంచి ఉంది. ఈ ప‌రిస్థితుల్లో ఈ ప్రాజెక్టు ఎప్ప‌టికి పూర్త‌వుతుంద‌నేది ఎవ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: