తెలంగాణం: నిరుద్యోగే.. నా ఎజెండా..?

తెలంగాణ రాజకీయం ఇప్పుడు నిరుద్యోగి చుట్టూ తిరుగుతోంది. తెలంగాణ ఉద్యమ పునాదులు కూడా నిరుద్యోగులపైనే ఉన్నాయన్న సంగతి తెలిసిందే. నీళ్లు, నిధులు, నియమాకాలు.. అన్నది తెలంగాణ ఉద్యమ సమయంలో బాగా వినిపించిన నినాదం.. తెలంగాణ వస్తే.. మన ఉద్యోగాలు మనకు వస్తాయని... ఇంటికో ఉద్యోగం వస్తుందని అప్పట్లో ఉద్యమ నేతలు తరచూ చెప్పేవారు. అందుకే తెలంగాణ ఉద్యమంలో యువత చాలా జోరుగా పాల్గొంది. యూనివర్శిటీలు ఉద్యమ కేంద్రాలయ్యాయి.

కానీ.. తెలంగాణ సాకారం తర్వాత మాత్రం నీళ్లు, నిధులపై దృష్టి సారించిన కేసీఆర్ సర్కారు నిరుద్యోగుల ఆశలు మాత్రం నెరవేర్చలేకపోయింది. ఎప్పడో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో వేసిన గ్రూప్ 1 నియామకం తప్ప.. కొత్తగా గ్రూప్ వన్ నియామకం చేపట్టలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేమంటే.. జోనల్ విధానం తెస్తున్నాం.. అంటూ ఇన్నాళ్లూ కేసీఆర్ సర్కారు సంజాయిషీ చెప్పుకుంటూ వస్తోంది. అందుకే కేసీఆర్ సర్కారుపై నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ఇప్పుడు తెలంగాణలో విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.

ఇటీవల కొత్తగా పార్టీ పెట్టిన షర్మిల మొదట్లో ఈ నిరుద్యోగ సమస్యపై బాగా ఫోకస్ పెట్టారు. నిరుద్యోగ దీక్షలు చేశారు. ఇందిరాపార్క్‌ల దీక్ష చేశారు. ఆ తర్వాత ప్రతి వారంలో ఒక రోజు నిరాహార దీక్ష చేస్తూ వస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. ఇక షర్మిల సంగతి ఇలా ఉంటే.. ఇప్పుడు బీజేపీ కూడా నిరుద్యోగులపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే తాజాగా బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష అంటూ ఒక రోజు దీక్ష నిర్వహించారు.

విపక్షాలు చేస్తున్న నిరుద్యోగ ఆకర్షణ కార్యక్రమాలు చూసి టీఆర్‌ఎస్‌లోనూ గుబులు పుడుతోంది. ఎన్నికలలోపు భారీగా నోటిఫికేషన్లు ఇవ్వకపోతే..ఈసారి యువత ఓట్లు విపక్షాల వైపు వెళ్లే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నాయి. మరి కేసీఆర్ ఏం చేస్తారు..? ఇకనైనా నోటిఫికేషన్లు ఇస్తారా.. అన్నది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: