సింహావలోకనం: ఎర్రన్నలూ.. మీరేమైపోయారు..?

భారత కమ్యూనిస్టు పార్టీ.. భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా మార్కిస్టు.. ఇవీ మన దేశంలోని ప్రధాన కమ్యూనిస్టు పార్టీలు.. సింపుల్‌గా చెప్పాలంటే సీపీఐ, సీపీఎం అన్నమాట. ఇవి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొన్ని అసెంబ్లీ సీట్లు గెలుచుకునేవి.. ప్రజాసమస్యలపై ప్రభుత్వాలను నిలదీసేవి.. ప్రజాసమస్యలపై అసెంబ్లీలోనూ, బయటాపోరాడేవి.. కానీ.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీల ఉనికే కరవైపోయింది. ఏపీ, తెలంగాణ రెండు చోట్లా అసెంబ్లీలో ఈ రెండు పార్టీలకు ప్రాతినిథ్యం కరవైపోయింది.

వాస్తవానికి కమ్యూనిస్టులు పేదల పక్షపాతులు.. పేదరికం ఎక్కువగా ఉన్న మన దేశంలో కమ్యూనిస్టులకు ఆదరణ ఎక్కువ ఉండాలి. కానీ.. విచిత్రంగా పేదల తరపున పోరాడే కమ్యూనిస్టులు మాత్రం ఎన్నికల రాజకీయంలో నెగ్గలేకపోతున్నారు. గతంలో కొందరు ప్రజల మద్ధతుతో అసెంబ్లీల అడుగు పెట్టినా.. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా సీపీఎం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఏపీలోని తాడేపల్లిలోని సీఎస్‌ఆర్‌ కల్యాణ మండపంలో మహాసభలు ఇవాళ జరుగుతున్నాయి. మూడ్రోజుల పాటు జరగే ఈ సీపీఎం రాష్ట్ర మహాసభలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కారత్, బీవీ రాఘవులు తదితరులు హాజరుకాబోతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతటా దాదాపు కమ్యూనిస్టులది అదే పరిస్థితి.. కేరళ వంటి కొన్ని చోట్ల తప్పతే ఎర్రన్నల ఉనికి దేశంలో కనిపించడం లేదు. మరి ఎర్రన్నలు ఎందుకు ప్రజల మనస్సు గెలుచుకోలేకపోతున్నారు.. ఎన్నికలంటే ధన రాజకీయంగా మారిన పరిస్థితుల్లో ఎర్రన్నలు నెగ్గలేకపోతున్నారా.. ప్రజలను ఆకర్షించేలా ప్రజాపోరాటాలు చేయడంలో ఎర్రన్నలు విఫలం అవుతున్నారా.. లేక ఎర్రన్నలు కూడా మిగిలిన పార్టీల తరహాలోనే అవలక్షణాలకు లోనవుతున్నారా.. అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిస్టులు సైతం మారాలి.. సిద్ధాంతాల పిడి వాదనతోనే కాకుండా క్షేత్ర స్థాయి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలి. ప్రజల కోసం పోరాడే కమ్యూనిస్టులు బలపడితే అది ప్రజాస్వామ్యానికే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: