శభాష్‌ చిత్రం : దేశాన్ని ఏకం చేస్తున్న సినిమాలు..?

సినిమా అంటే.. ఓ వినోదం.. సినిమా అంటే ఓ వ్యాపకం.. చాలా మందికి సినిమా ఓ వ్యసనం. నిత్య జీవితంలో ఎన్నో చిరాకులతో గడిపే సగటు జీవికి సినిమా ఓ ఊరట.. ఓ ఆనందం.. అందుకే సినిమా చాలా మంది జీవితాల్లో భాగం అవుతుంది. సినీనటులు చాలామందికి కుటుంబ సభ్యులవుతారు. సినిమా పాటలు ఎందరి నోటిపైనో షికారు చేస్తుంటాయి. అంతటి సత్తా ఉన్న మాయాజాలం చలన చిత్రం.. అయితే.. విభిన్న అనేక భాషలు, ప్రాంతాలు, సంస్కృతులు ఉన్న భారతావనిలో సినిమాలు కూడా అంతే.. ఉత్తరాదిన హిందీ చిత్రాల ప్రభంజనం.. దక్షిణాదిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలో.. మధ్య దేశంలో భోజ్‌పురి వంటి సినీ రంగాలు.

అయితే.. మారుతున్న సినీ పరిశ్రమ ఇప్పుడు దేశాన్ని ఏకం చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న పాన్ ఇండియా కల్చర్ ఇప్పుడు దేశాన్ని ఐక్యం చేస్తోంది. గతంలో ఉత్తరాది ప్రేక్షకులు వేరు.. దక్షిణాది ప్రేక్షకులు వేరు.. ఉత్తరాది సినిమాలు వేరు.. దక్షిణాది సినిమాలు వేరు.. ఎప్పుడో ఎవరో ఒకరిద్దరు నటులు, నటీమణులు ఉత్తరాదికి వెళ్లి కొన్ని సినిమాలు చేసేవారు తప్ప.. దేశమంతా ఒకే సినిమా గతంలో ఆడిన దాఖలాలు చాలా తక్కువ. హిందీ సినిమాలు బాగా హిట్ అయినా.. అవి దక్షిణాదిలో డబ్ అయ్యి హిట్ అయ్యే సినిమాలు చాలా తక్కువగా ఉండేవి.

కానీ ఇప్పుడు పాన్ ఇండియా కల్చర్ కారణంగా.. దక్షిణాది సినిమాలు కూడా ఉత్తరాదిన బాగా ఆడుతున్నాయి. దక్షిణాది నటులు సైతం ఉత్తరాదిన పేరు తెచ్చుకుంటున్నారు. బాహుబలి వంటి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కేజీఎఫ్‌ సినిమాతో యశ్‌ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు పుష్ప వంటి పాన్ ఇండియా సినిమా వల్ల అల్లు అర్జున్‌ సినిమా దేశమంతా ఆడుతోంది. ఆర్‌ ఆర్‌ ఆర్‌, రాధేశ్యామ్, ఆది పురుష్ వంటి సినిమాలు ఇప్పుడు దేశమంతటా విడుదల కాబోతున్నాయి.

అంటే ఒకే సినిమా ఇప్పుడు ఒకే సమయంలో ఇండియా అంతటా ఆడబోతోంది. అలా పాన్ ఇండియా సినిమా దేశాన్ని ఏకం చేస్తోంది. ఇలా దేశం మొత్తం ఏక కాలంలో ఒకేలా అనుభూతి చెందించే అవకాశం ప్రస్తుతం సినిమాకు మాత్రమే దక్కుతున్న గౌరవంగా చెప్పుకోవడం అతిశయోక్తి కాదేమో.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: