ఈసారి పీకే ఎవరి త‌ల‌రాత మార్చ‌నున్నాడో...?

           ప్ర‌శాంత్ కిషోర్‌.. ఇప్పుడు భార‌త రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇత‌డో సంచ‌ల‌నం. అలాగ‌ని ఇత‌డేం రాజ‌కీయ‌వేత్త కాదు.. ఘ‌న చ‌రిత్ర ఉన్న నేత‌ల వార‌సుడూ కాదు. ఫిల్మ్‌స్టార్‌గానో, క్రికెటర్‌గానో సంపాదించుకున్న‌ప్ర‌జాద‌ర‌ణ‌తో రాజ‌కీయాల్లోకి వ‌చ్చినవాడు అస‌లే కాదు. మ‌రి..ఎవ‌రంటే.. ఓ రాజ‌కీయ వ్యూహ నిపుణుడు.. త‌న తెలివితేట‌ల‌తో రాజ‌కీయాల‌ను ఓ లాభ‌దాయ‌క‌మైన వ్యాపారంగా మార్చుకున్న కొత్త‌త‌రం బిజినెస్‌మేన్‌ అంతే..! ఒక ఐదారేళ్ల క్రితం వ‌ర‌కూ అస‌లు ఇత‌డి గురించి ఉత్త‌రాదికి చెందిన‌ కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌కు త‌ప్ప దేశంలో మ‌రెవ‌రికీ తెలియ‌దు. కానీ ఇప్పుడు ఏ రాష్ట్ర రాజ‌కీయాల్లోనైనా ఒక పార్టీకి అనుకూలంగా ఇత‌డు తన వ్యూహాల‌తో త‌ల‌దూరుస్తున్నాడ‌ని తెలిస్తే చాలు.. అక్క‌డి ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు వ‌ణుకు పుడుతోంది. ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల‌ను శాసించిన ఘ‌న చ‌రిత్ర ఉన్న నేత‌లు కూడా ఇత‌డి వ్యూహాలు అర్థంకాక బొక్కబోర్లా ప‌డుతున్నారు. ఆ త‌ర్వాత ఎందుకు ఓడిపోయామో తెలియ‌క జుట్టు పీక్కొంటున్నారు. గ‌త కొన్నేళ్లుగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప‌లు రాష్ట్రాల్లో పార్టీల త‌ల‌రాత‌ల‌ను ఇత‌డు మార్చి రాశాడ‌ని చెప్పాలి.
అయితే ఇత‌డితో ఒప్పందాలు చేసుకోవ‌డం అంత వీజీ ఏం కాదు.. వంద‌ల కోట్ల వ్య‌యంతో కూడిన విష‌యం. చిన్నా చిత‌కా పార్టీలు ఇత‌డితో వ్య‌వ‌హారం న‌డ‌ప‌లేవు. అస‌లు 2014కు ముందు బీజేపీని, మోదీని  ప్ర‌మోట్ చేసి ఆ పార్టీకి ఢిల్లీ పీఠం ద‌క్కేలా చేయ‌డం వెనుక ఉన్న‌మాస్ట‌ర్ మైండ్ ఇత‌డిదే అని చెపుతారు. అయితే అంత‌కు ముందే 2012లో మోదీ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా మూడోసారి గెల‌వ‌డంలోనూ ఇత‌డి వ్యూహాల‌దే ప్ర‌ధాన పాత్ర అని, పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ గా అప్పుడే ఇత‌డు వెలుగులోకి వ‌చ్చాడ‌న్న విష‌యం చాలా కొద్దిమందికే తెలుసు. అందుకే అప్ప‌టినుంచి ఇత‌డు మోదీషాల‌తో స‌న్నిహిత సంబంధాల‌నే క‌లిగి ఉన్నాడ‌ని చాలామంది చెపుతారు.
          గ‌తంలో ఏపీలో వైసీపీ గెలుపున‌కు, త‌మిళ‌నాట స్టాలిన్ కు సీఎం పీఠం ద‌క్క‌డం వెనుక‌, బెంగాల్లో దీదీ మూడోసారి జైత్ర‌యాత్ర సాగించ‌డం వెనుక ప్ర‌ధాన వ్యూహాలు ఇత‌డివే. ఒప్పందం కుదుర్చుకున్న పార్టీకి విజ‌యం చేకూర్చేందుకు అత‌డు అనుస‌రించే వ్యూహాలు ప్ర‌త్య‌ర్థి పార్టీకి ఊహ‌కు కూడా అంద‌నివిధంగా ఉంటాయ‌ని చెప్పాలి. ఇక ఇత‌డు అనుస‌రించే స‌మాజాన్ని చీల్చే సోష‌ల్ ఇంజనీరింగ్ విధానాలు దేశానికి అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మన్న విమ‌ర్శ‌లు చాలా ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా త‌న వ్యూహాల అమ‌లుకోసం భారీగా జీతాలు ఆఫ‌ర్ చేసి పెద్ద సంఖ్య‌లో సిబ్బందిని నియ‌మించుకుంటున్నాడ‌ని, వారిలో కొంద‌రు ఐఐటీ నుంచి ప‌ట్టా పుచ్చుకున్న మేధావులు కూడా ఉన్నార‌న్న వార్త‌లు ఇప్ప‌టికే రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిని  క‌లిగిస్తున్నాయి. మ‌రి భ‌విష్యత్తులో ఇత‌డు ఏ పార్టీల‌కు అనుకూలంగా ప‌ని చేయ‌బోతున్నాడ‌న్నది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: