నారా లోకేశ్‌ రంకెలు.. మరీ ఇంత ఆలస్యమా గురూ..?

నారా భువనేశ్వరిపై అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న వివాదం కొన్నిరోజుల క్రితం ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టించింది. ఈ వివాదంతోనే ఏకంగా చంద్రబాబు వంటి నాయకుడు కూడా ప్రెస్‌ మీట్లో భోరున విలపించారు. నా భార్యను ఇంతగా అసెంబ్లీలో అవమానిస్తారా అంటూ ఆయన రోదించారు. ఆ తర్వాత ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయ్యింది. చంద్రబాబు విలపించిన మరుసటి రోజు ఏకంగా నందమూరి కుటుంబం అంతా స్పందించింది. బాలకృష్ణ అయితే.. ఇకపై ఇలాంటి మాటలు మాట్లాడితే నాలుక కోస్తామన్న రేంజ్‌లో హెచ్చరించారు.

అలా కొన్నిరోజుల పాటు నారా భువనేశ్వరి ఇష్యూ ద్వారా టీడీపీ నేతలు వైసీపీ తీరుపై విమర్శలు చేసేవారు. క్రమంగా ఆ విషయం సైడ్ అవుతున్న సమయంలో ఇప్పుడు నారా లోకేశ్ మరోసారి ఈ ఇష్యూపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నా తల్లిని అంటే నేను ఊరుకుంటానా.. అంటూ నారా లోకేశ్‌ రంకెలు వేశారు. మేం ఏమైనా జగన్ కూతుళ్లను ఏమైనా అన్నామా అని కూడా నారా లోకేశ్ అన్నట్టు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అయితే.. నారా లోకేశ్ ఆ మాత్రం ఆవేశపడటంలో అర్థం ఉంది.. ఆవేశ పడే హక్కు కూడా ఆయనకు ఉంది. దీంట్లో ఎలాంటి వివాదం లేదు.

తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరైనా అలాగే స్పందిస్తారు.. అయితే.. ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే.. అసలు వల్లభనేని వంశీ ఈ వ్యాఖ్యలు చేసి చాలా కాలమైంది. దీనిపై ఏపీ అసెంబ్లీలో రాద్ధాంతం జరిగి కూడా చాలా రోజులైంది.. భువనేశ్వరి ఇష్యూలో టీడీపీ నేతలు చాలామంది స్పందించేశారు. అయితే.. అంతా ఆ ఇష్యూను మరిచిపోతున్న సమయంలో ఇప్పుడు నారా లోకేశ్.. నా తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటానా అంటూ రంకెలు వేయడం కాస్త విడ్డూరంగానే ఉంది.

అసలు నారా లోకేశ్‌.. వల్లభనేని వంశీ అలాంటి మాటలు అన్నప్పుడే స్పందించాల్సింది. పోనీ.. అసెంబ్లీలో వ్యాఖ్యల తర్వాత చంద్రబాబు రోదించినప్పుడైనా మాట్లాడి ఉండాల్సింది.. కానీ.. మరీ ఇంత ఆలస్యంగా స్పందించడం ఏంటన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: