పాపం షర్మిల: ఎవరూ పట్టించుకోవడం లేదుగా..?

వైఎస్‌ షర్మిల.. తండ్రి వైఎస్సార్‌ ముద్దుల కుమార్తె.. అలా వైఎస్సార్‌ కుమార్తెగానే గుర్తింపు ఉన్న సమయంలో ఆమె అనూహ్యంగా జనంలోకి రావాల్సి వచ్చింది. తండ్రి హఠాన్మరణం తర్వాత తన అన్న సొంతంగా పార్టీ పెట్టుకున్న తర్వాత.. అనూహ్య పరిస్థితుల్లో అన్న జైలుకు వెళ్తే.. ఆ పార్టీని కాపాడుకునే బాధ్యత ఆమె భుజాన వేసుకున్నారు. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన పార్టీకి ఊపిరిలూదారు. అప్పటి వరకూ ప్రజాజీవితంలోకి పెద్దగా వెళ్లింది లేకపోయినా.. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జనంలోకి దూసుకెళ్లారు. అలా వైసీపీ ప్రస్థానంలో ఆమెకో ప్రత్యేక పాత్రే ఉంది.

అయితే.. అన్నతో విబేధించో.. సొంతంగా ఎదగాలనో ఆమె తెలంగాణలో తండ్రి పేరుతో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ పెట్టుకున్నారు. అప్పటి నుంచి సొంత గుర్తింపు కోసం ఆమె ఒంటరి పోరాటం చేస్తున్నారు. ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలంటే ప్రజల్లోకి వెళ్లాలి.. తండ్రి చెప్పిన మాటలు ఇవే.. వీటినే తారక మంత్రంగా భావించిన వైఎస్ షర్మిల అదే బాటలో సాగుతున్నారు. పార్టీ పెట్టిన కొన్ని రోజులకే.. నిరుద్యోగుల కోసం హైదరాబాద్‌లో ఆమరణ దీక్ష ప్రారంభించారు.. దాన్ని భగ్నం చేస్తే.. ఇంట్లో రెండు మూడు రోజులు కొనసాగించారు. ఆ తర్వాత దీక్ష విరమించినా ప్రతి మంగళ వారం నిరాహర దీక్ష చేస్తూనే ఉన్నారు.

అంతే కాదు.. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఆత్మహత్యల విషయంలో వాటికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ అధికార పార్టీని విమర్శిస్తున్నారు. ఇలా జనం కోసం ఆమె చేయాల్సినవన్నీ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే.. ఆమె ఎన్ని చేస్తున్నా ఆమె పార్టీని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆమె పార్టీ ఉనికిని పెద్దగా గుర్తించడం లేదు. మరి ఇలాగైతే.. తెలంగాణకు తొలి మహిళా మఖ్యమంత్రినవుతానన్న షర్మిల శపథం నెరవేరేది ఎలా..?

పార్టీలో కొత్తగా చేరికలు లేవు.. ఉన్నవాళ్లు ఒకళ్లిద్దరు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే తెలంగాణలో రాజకీయంగా పోటీ చాలా తీవ్రంగా ఉంది. మరి ఇన్ని సవాళ్ల నడుమ షర్మిల తనదైన ముద్ర వేస్తారా.. సత్తా నిరూపించుకుంటారా.. ఏమో.. ప్రస్తుతానికి మాత్రం ఆమె పార్టీ తన ముద్ర వేయలేకపోయింది. లోపాలు బేరీజు వేసుకుని మార్గం మార్చుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: