జగన్ రూట్లో కేసీఆర్.. అంత భారం మోస్తారా..?

పరిపాలనతో ఒక్కో నాయకుడిదీ ఒక్కో స్టయిల్.. కొందరు ముఖ్యమంత్రులు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తారు.. మరికొందరు ముఖ్యమంత్రులు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఇంకొందరు ముఖ్యమంత్రులు మధ్యే మార్గంగా వెళ్తుంటారు. ఇంకొందరు అసలు ఏ విజనూ లేకుండా కాలం గడిపేస్తుంటారు. అయితే.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో సీఎం కేసీఆర్‌ది మిశ్రమ ధోరణి.. అభివృద్ది పథకాలు, సంక్షేమ పథకాలు రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు. రైతుబంధు, ఫించన్లు వంటి పథకాలు అమలు చేస్తూనే అటు కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేశారు. మరికొన్ని ప్రాజెక్టులపై సీరియస్‌గా దృష్టి పెట్టారు.

ఇక ఏపీ సీఎం జగన్‌ది పూర్తిగా సంక్షేమంపై ఆధారపడిన పాలనగా విశ్లేషకులు చెబుతుంటారు. ప్రజా సంక్షేమమే నా ప్రథమ కర్తవ్యం అన్నట్టుగా ఉంటుంది జగన్ పాలన. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేయడం తన మొదటి ప్రయారిటీ.. దీన్ని తప్పుబట్టాల్సిన అవసరమూ లేదు.. ఎందుకంటే.. ఆ హామీలు చూసే కదా జనం గెలిపించారు. మరి జనానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి కదా. అయితే.. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా జగన్ రూట్లోకి వస్తున్నారా అనిపించకమానదు.

ఇటీవల సీఎం కేసీఆర్ కూడా భారీ సంక్షేమ పథకం దళిత బంధు ప్రారంభించారు. దీని ద్వారా ప్రతి దళిత కుటుంబానికి ఏకంగా రూ. 10 లక్షల రూపాయల సాయం అందజేస్తారు. ఇది బహుశా భారత దేశంలోనే అత్యంత ఖరీదైన సంక్షేమ పథకంగా చెప్పుకోవచ్చు. హుజూరాబాద్ ఎన్నికల ముందు దీన్ని ప్రారంభించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడిపోయినా ఈ పథకాన్ని మాత్రం కొనసాగించాలనే సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

మరి ఇంత భారీ పథకం అమలు చేయాలంటే.. రాష్ట్ర బడ్జెట్‌లో సంక్షేమానికి సింహ భాగం కేటాయించక తప్పదు. అప్పుడు సాధారణంగానే అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత తప్పదు. అంటే సీఎం కేసీఆర్ కూడా ఇప్పుడు ఏపీ సీఎం జగన్ రూట్లోనే వెళ్తున్నారని చెప్పొచ్చు. మరి ఈ దళిత బంధు వంటి అత్యంత ఖరీదైన స్కీమ్‌ను కేసీఆర్ ఎలా అమలు చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: