వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్‌.. వారెవా.. వాటే ఐడియా..?

కరోనా.. ప్రపంచానికి ఎంతో కీడు చేసింది. అయితే.. కరోనా వల్ల కొత్త అవకాశాలు కూడా వచ్చాయన్నది కాదనలేని సత్యం.. ఈ ప్రపంచంలో కొన్ని విషయాల గురించి భవిష్యత్తులో కరోనా ముందు.. కరోనా తర్వాత అని చెప్పుకోవాల్సిన రోజులు వచ్చే అవకాశం ఉంది. అలాంటి విషయాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేది ప్రధాన అంశం అవుతుంది. కరోనా పుణ్యమా అని చాలా మంది సొంత ఇంటిలో కూర్చుని ఆఫీసు పని చేసుకుంటున్నారు. మొదట్లో ఇదో తప్పనిసరి అవసరంగా మారింది. అలా మొదలైన ఈ వర్క్ ఫ్రమ్ హోం కల్చర్.. పని సంస్కృతిలో అనేక మార్పులు తెచ్చింది.

ప్రధానంగా ఆఫీసుకు వచ్చి మాత్రమే పనిచేయాల్సిన ఎన్నో కార్యాలయాలు ఇప్పుడు మూతపడుతున్నాయి. ఉద్యోగులకు కంప్యూటర్ ఇచ్చి ఇంటి నుంచే పని చేయమని  ప్రోత్సహిస్తున్నాయి. దీనివల్ల ఆఫీసులకూ డబ్బు ఖర్చు మిగుల్తోంది. అయితే ఇలాంటి వారు నిరంతరం ఇంటి వద్ద కూర్చుని పని చేయాలంటే అనేక ఇబ్బందులు కూడా ఉన్నాయి. వీటిని అధిగమించేందుకు ఏపీ సర్కారు కొత్త ఐడియా అమల్లోకి తెచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌ టౌన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. తాజా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్‌ టౌన్ వెబ్‌సైట్ ను మంత్రి గౌతంరెడ్డి ఆవిష్కరించారు.

కరోనా వల్ల ఐటీ ఉద్యోగులకు సొంత పట్టణాల నుంచే పని చేసుకునే అవకాశం వీటి ద్వారా కలుగుతోంది. డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీ కేంద్రాల్లో విద్యుత్, హైస్పీడ్ ఇంటర్నెట్ వసతులు కల్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 29 చోట్ల వర్క్ ఫ్రమ్ హోమ్‌టౌన్ కేంద్రాలను పైలట్ ప్రాజెక్టుగా ఏపీ సర్కారు తీసుకొస్తోంది. ఒక్కో కేంద్రంలో కనీసం 30 మంది కూర్చుని పనిచేసుకునేలా వెసులుబాటు కల్పిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మరిన్ని వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ టౌన్ కేంద్రాలు ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.


దీని ద్వారా సొంత ఊరి నుంచే.. ఉద్యోగులు పని చేసుకోవచ్చు. ఉద్యోగులు వారి సొంత ఊళ్ల నుంచే పని చేసుకునేలా ఈ కేంద్రాలు ఉంటాయి. డెస్క్‌టాప్‌లు, హైస్పీడ్‌ ఇంటర్‌నెట్, నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా, డేటా భద్రత వంటి అన్ని వసతులతో కోవర్కింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: