గల్లీలో ఉడుత ఊపులు.. దిల్లీలో స్నేహ హస్తాలు?

తెలుగు రాష్ట్రాల రాజకీయాలు విచిత్రంగా ఉంటున్నాయి. ప్రత్యేకించి కేంద్రంతో సాగించే రాజకీయలు మరీ విచిత్రంగా ఉంటున్నాయి. ఇటు ఏపీ అయినా.. అటు తెలంగాణ అయినా అదే పరిస్థితి. తెలంగాణలో కేసీఆర్ బీజేపీపై ఫైర్ అవుతుంటారు.. గతంలోనూ అలాగే ఫెడరల్ ఫ్రంట్ అంటూ నానా హడావిడి చేశారు. ఆ తర్వాత ఎప్పుడు డిల్లీ వెళ్లినా.. కేంద్రం పెద్దలతో సత్సంబంధాలే మెయింటైన్ చేశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితే వస్తోంది. కొన్నాళ్ల క్రితమే ఢిల్లీ వెళ్లి వారంపైగా మకాం వేసి అనేక విషయాలపై కేంద్రం పెద్దలతో చర్చలు జరిపిన కేసీఆర్.. ఆ తర్వాత కొన్నాళ్లకే కేంద్రంపై కారాలు మిరియాలు నూరుతున్నారు.

అటు వైసీపీదీ అదే కథ. జగన్ ఎప్పడు డిల్లీకి వెళ్లినా.. కేంద్రం పెద్దలతో గంటల తరబడి మాట్లాడతారు.. అంతా సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగినట్టు చెబుతారు. అదే వైసీపీ నాయకులు రాష్ట్రంలో బీజేపీ నాయకులపై కారాలు, మిరియాలు నూరుతుంటారు. ఇప్పుడు బీజేపీ నాయకులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో.. గల్లీలో ఉడుత ఊపులు, బెదిరింపులు చేసే నాయకులు.. ఢిల్లీలో మాత్రం పాదక్రాంతులవుతారా.. అంటూ ప్రశ్నిస్తున్నారు.

తాజాగా పెట్రోల్‌ రేట్ల తగ్గింపు వివాదం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పాలక పార్టీలతో బీజేపీ గొడవలు మరోసారి ప్రముఖంగా వార్తల్లోకి ఎక్కుతున్నాయి. పెట్రోల్ రేట్ల తగ్గింపు విషయంలో మీదే తప్పు అంటే.. కాదు మీదే తప్పు అని పాలక పార్టీలు, కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ విమర్శలు చేసుకుంటున్నాయి. కేంద్రం సెస్సుల పేరుతో దోచుకుంటోందని..లక్షల కోట్లు ప్రజల నుంచి దోచుకుని రాష్ట్రాలకు పంచట్లేదని తెలుగు రాష్ట్రాల్లోని పాలక పార్టీలు అంటుంటే.. మేం తగ్గించాం కాబట్టి మీరు కూడా పన్ను తగ్గించుకోండని బీజేపీ అంటోంది.

ఈ పెట్రోల్ రేట్ల గొడవతో ఇప్పుడు ఉప్పు నిప్పుగా ఉన్న టీఆర్ఎస్‌-బీజేపీ.. వైసీపీ-బీజేపీ.. మళ్లీ ఢిల్లీలో బాగానే పలకరించుకుంటాయి. కేసీఆర్, జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడు మళ్లీ కేంద్రం పెద్దలతో చర్చలు మామూలే.. ఇదేనేమో గల్లీలో ఉడుత ఊపులు.. ఢిల్లీలో స్నేహహస్తాలు అంటే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: