ఏపీ పాలిటిక్స్‌: యథా రాజా తథా ప్రజా!?

N.Hari
అనరాని మాట ముఖ్యమంత్రి నోట వచ్చింది.. ఇక మనం అంటే తప్పు ఏముంది? అన్నట్లుగా వైసీపీ నేతల మాట తీరు ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ కొందరు నేతలు అడపాదడపా తిట్లు, దూషణలు, బూతులు మాట్లాడారు. అయితే గత మూడు రోజులుగా ఏపీలో బూతు రాజకీయం రాజ్యమేలుతోంది. ముఖ్యంగా గురువారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొని ప్రసంగించి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బోసిడీకే పదానికి అర్థం చెబుతూ.. తన నోటి వెంట అనరాని మాటను వెలిబుచ్చారు. సాక్షాత్తు సీఎం నోట ఆ మాట(రాయడానికి వీల్లేనిది) రావడంతో.. అధికార పార్టీ నేతలు ఆ పదాన్ని ప్రయోగించడం అధికమైంది. వైసీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలో పాల్గొన్న నాయకులు పలుచోట్ల బూతులతో రెచ్చిపోయారు. ముఖ్యంగా ఆ అసభ్య పదజాలాన్ని పదేపదే వల్లించడం చర్చనీయాంశం అయింది. వారు ఆవేశంతో ఊగిపోతూ తిట్టిన తిట్లు, బూతులతో కూడిన ప్రసంగాలు.. మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంలో చేపట్టిన వైసీపీ జనాగ్రహ దీక్షలో కుప్పం రెస్కో ఛైర్మన్‌ సెంథిల్‌ కుమార్‌ వీరావేశంతో ఊగిపోయారు. ఏకంగా చంద్రబాబుపైనే ఆయన అసభ్య పదజాలంతో మండిపడ్డారు. "దమ్ముంటే రా.." "నీ కారు మీద బాంబు వేస్తా.." అంటూ పూనకం వచ్చినవాడిలా మాట్లాడారు. దీంతో కుప్పంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నిరసన వ్యక్తం చేసేందుకు రోడ్డెక్కారు. వారిని వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. ఇరువర్గాల వారు బాహాబాహీకి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు పార్టీల వారిని అదుపు చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. చివరకు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
ఇక విశాఖలో రెండు చోట్ల వైసీపీ జనాగ్రహ దీక్షల్లో పాల్గొన్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సైతం బూతులతో రెచ్చిపోయారు. సీఎం జగన్‌ నోట వచ్చిన మాటను పలుమార్లు వల్లిస్తూ.. టీడీపీ నేత పట్టాభి రామ్‌ను తిట్టిపోశారు. అలాగే చంద్రబాబుపైనా తీవ్ర పదజాలంతో దూషణలకు దిగారు. ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌ఛార్జి, ఎంపీ విజయసాయిరెడ్డితోపాటు జనాగ్రహ దీక్షలో పాల్గొన్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గతంలో ఎన్నడూ లేనివిధంగా మాట్లాడటం విశాఖ వాసులను నివ్వెరపరిచేలా చేసింది.
అలాగే కృష్ణా జిల్లా నూజివీడులో జనాగ్రహ దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు కూడా ఆవేశంతో రగిలిపోయారు. పూనకం వచ్చినట్లుగా మాట్లాడారు. పట్టాభి ఖబడ్దార్‌, బద్మాష్‌ అంటూ అసభ్య పదజాలంతో మండిపడ్డారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజు జరిగిన వైసీపీ జనాగ్రహ దీక్షల్లో పలువురు నేతలు బూతు మాటలతో రెచ్చిపోవడం కనిపించింది. దీంతో అనరాని మాట సీఎం జగన్‌ నోట రావడంతోనే.. అదేమీ పెద్ద తప్పు మాట కాదన్నట్లుగా వైసీపీ నేతలు కూడా ఆ బూతు పదాన్ని విరివిగా వాడారన్న చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: