అడవుల్లో అన్నలు.. అనారోగ్య కష్టాలు..!?

మావోయిస్టులు అడవుల్లో ఉండి.. జనం కోసం పోరాడుతున్నామంటారు. అయితే.. పోలీసులకు చిక్కకుండా పోరాడటం అంత సులువైన పనేమీ కాదు.. జాడ పోలీసులకు తెలిస్తే.. ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే. అసలు మావోయిస్టుల్లో చేరేటప్పుడే ప్రాణాలపై ఆశలు వదిలేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు అన్నలను ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. మావోయిస్టు పార్టీ నేతలు దీర్ఘకాలంగా అడవుల్లో ఉంటారు. వారి ఆహారపు అలవాట్ల కారణంగా.. నిద్రలేమి కారణంగా.. శారీరక శ్రమ వల్ల అనేక వ్యాధులకు గురవుతుంటారు.

మావోయిస్టు నేతల్లో చాలా మంది రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నట్లు  తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులకు సమాచారం కూడా  ఉంది. తాజాగా మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అనారోగ్యంతో కన్నుమూశారు. ఇప్పుడు కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్‌, ఇర్వి మోహన్‌ రెడ్డి వంటి వారు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆడెళ్లు, జిల్లా కమిటీ సభ్యురాలు కంతి లింగవ్వ వంటి వారినీ వ్యాధులు వేధిస్తున్నాయి.

ఇప్పటికే.. అనారోగ్యం, వయోభారం కారణంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి గణపతి వైదొలగారు. ఏడు పదులు దాటిన  గణపతి ఆర్థరైటిస్‌తో పాటు అనేక ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన్ను ఎక్కడికైనా  మోసుకెళ్లాల్సి వస్తోందని సమాచారం. ఆయనతో పాటు  నంబాల కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌, సత్వాజీ, పుల్లూరి ప్రసాదరావు, రావుల శ్రీనివాస్‌, మల్లోజుల వేణుగోపాల్‌రావు, కటకం సుదర్శన్‌, మల్లా రాజిరెడ్డి వంటి నేతలు కూడా వయోభారంతో ఉన్నారు.

ఇంకా తిప్పిరి తిరుపతి, కడారి సత్యనారాయణ రెడ్డి, మోడెం బాలకృష్ణ.. ఇలా మావోయిస్టు నేతలంతా 60 ఏళ్లు వచ్చినవారే.. కొన్నాళ్ల క్రితం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామన్న కూడా  గుండెపోటుతో మృతి చెందారు. ఇటీవల కరోనా కూడా అన్నలను వణికించింది. ఒకరిద్దరు చికిత్స కోసం అడవుల నుంచి పట్టణాలకు వచ్చి పోలీసులకు చిక్కారు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: