మా పోరు : మోనార్క్ ను మోసం చేసిందెవరు?

RATNA KISHORE
తాజాగా ప్ర‌కాశ్ రాజ్ మా ప్రాథ‌మిక స‌భ్యత్వంకు రాజీనామా చేయ‌డ‌మే సిస‌లు వివాదానికి కార‌ణం అని తేలిపోయింది. ఇక‌పై .. ఈ సంస్థ‌కు దూరంగా ఉంటాన‌ని చెప్ప‌డం వెనుక అనేక అంత‌రార్థాలున్నాయి.. వాటి విశ్లేష‌ణ ఈ క‌థ‌నం.

నాగ‌బాబు మాట‌లు మోనార్క్ ను మోసం చేశాయి..తెర‌పై మాట్లాడే మాట‌ల‌కూ, బ‌య‌ట మాట‌ల‌కూ పొంత‌న లేక‌పోవ‌డం ప్ర‌కాశ్ రాజ్ కొంప కూల్చాయి. చిరు మాట్లాడ‌క పోవ‌డం మ‌ద్ద‌తు విష‌య‌మై ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డం ప్ర‌కాశ్ రాజ్ ను నిరాద‌ర‌ణ‌లోకి నెట్టేశాయి. మోహ‌న్ బాబు నేరుగా కాక‌పోయినా ఎంతో కొంత ప్ర‌కాశ్ రాజ్ విష‌య‌మై సైలెంట్ అయిపోయారు. కానీ నాగ బాబు అలా  కాదు ఆయ‌న ఓ రేంజ్ లో విమ‌ర్శ‌లు చేశారు. వీటితో పాటు ప‌వ‌న్ వ్యాఖ్య‌లు కార‌ణంగా మోనార్క్ కు ఇబ్బందులు త‌ప్ప‌లేదు. ఎవ‌రి ఉద్దేశాల‌కు అనుగుణంగా వారు మాట్లాడిన కార‌ణంగానే ఇన్ని వివాదాలు వ‌చ్చాయి. అలానే విష్ణు స‌ర్కిల్లో కూడా ఎవ్వ‌రూ ఏం త‌గ్గ‌లేదు. కానీ మోహ‌న్ బాబు చేసిన లాబీయింగ్ , ప్ర‌కాశ్ రాజ్ చేయ‌క‌పోవ‌డ‌మే కాదు ఆయ‌న సీనియ‌ర్ల‌ను సైతం క‌లుపుకుని పోక‌పోవ‌డం, ప్రాంతేత‌ర న‌టుల‌ను సైతం త‌న‌వైపు తిప్పుకోక‌పోవ‌డం, మాలాశ్రీ లాంటి క‌న్న‌డ న‌టులు ఇక్క‌డికి వ‌చ్చి ఓటేయ‌డం అది  కూడా విష్ణుకు అనుగుణంగా వాళ్లంతా ఉండ‌డం ఇవ‌న్నీ మోన‌ర్క్ ను నిలువునా ముంచిన ప‌రిణామాలే!

మా ఎన్నిక‌లు మొద‌ట్నుంచి ఆస‌క్తిని రేపాయి. వాగ్వాదాల‌కు ప్రాధాన్యం ఇచ్చి, వ్య‌క్తుల‌ను, వారి ఇమేజ్ ల‌ను వాడుకునే ప్ర‌య‌త్నం తెగ చేశాయి. అదేవిధంగా ఈ ఎన్నిక‌ల్లో కులాల ప్ర‌స్తావ‌న కూడా ఉంది. కానీ అదెక్క‌డ బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త ప‌డ్డార‌న్న‌ది ఓ వాద‌న. ఇదే స‌మ‌యంలో ప్ర‌కాశ్ రాజ్ ముందు నుంచి మొండిగా పోతున్నారు. ఆయ‌న సాధించాల్సిన దాని కంటే ఎక్కువే సాధించానన్న అహంతో పోయారు. దీంతో ఆయ‌నను  ఓట‌మి వెన్నాడింది. తెలుగు విష‌య‌మై, భాష‌ను ప‌లికే తీరు విష య‌మై ఆయ‌న చెప్పిన మాట‌లు, చేసిన విమ‌ర్శ‌లే పెద్ద ప్ర‌మాదానికి తావిచ్చాయి. అవే ఆయ‌న‌ను నిండా ముంచాయి. ఆయ‌న ఓట‌మికి కార‌ణం అయ్యాయి. ముఖ్యంగా తాజాగా తీసుకున్న నిర్ణ‌యం నేప‌థ్యంలోనే కొత్త వివాదాల సుడి మొద‌లుకానుంది. ప్రాంతీయ వాదం అన్న మాటే ఎక్క‌డైనా నెగ్గేది అని తేలిపోయింది. జాతీయ వాదం తాను వినిపించినా త‌న వాదం ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేద‌ని, కేవ‌లం తెలుగు వారే ఇక్క‌డ ఉండాలి, ఈ ప‌ద‌విని అందుకోవాలి అన్న వాదం ఒక‌టి వినిపించి త‌న‌ను మాన‌సికంగా హింసించార‌ని అన్నారు.


 తాను విశ్వ‌న‌టుడ్ని అని, త‌న‌కు అవ‌కాశాలు ఆపేస్తార‌న్న బెంగ కూడా లేదు అని, అలా చేయాల‌నుకున్నా చేసుకోవ‌చ్చ‌ని కానీ వ‌స్తున్న రెండేళ్ల‌లో తానేంటో  చూపిస్తానని చెప్పారు. వాస్త‌వానికి ప్ర‌కాశ్ రాజ్ కు ఇప్ప‌టికీ మంచి నిర్మాత‌ల అండ ఉన్న‌ప్ప‌టికీ, మోహ‌న్ బాబును వ్య‌తిరేకించి ఆయ‌న ముందుకు పోలేరు. అదేవిధంగా  మెగా సినిమాల్లో ఆయ‌న‌కు అవ‌కాశాలు వ‌చ్చినా ఏడాదిలో మెగా కాంపౌండ్ నుంచి ఎన్ని సినిమాలొస్తున్నాయి..వాటిలో ప్ర‌కాశ్ రాజ్ స్థాయిని పెంచే పాత్ర‌లు ఎన్ని ఉంటాయ‌న్న‌ది సంశ‌యమే. చిరు మాత్రం ప్ర‌కాశ్ రాజ్ విష‌య‌మై పెద్ద‌గా బ‌య‌ట‌కు మాట్లాడ‌క‌పోవ‌డం ఓ పెద్ద  త‌ప్ప‌ద‌మే! ఆ విధంగా చూసుకుంటే మోనార్క్ ను మోసం చేసింది ఈ యుద్ధంలో దింపిన వారే..! ఆయ‌న స్థాయి ఇది కాద‌ని  ఎందుకు ఈ ప‌ద‌వికి వెంప‌ర్లాడుతున్నారో త‌న‌కు అర్థం కాలేద‌ని శివాజీ అన్న‌దీ ఇందుకే! ఏద‌యినా స్థాయి త‌గ్గించుకుని మోనార్క్ ప్ర‌కాశ్ రాజ్ అంద‌రి కీ శ‌త్రువు అయిపోయారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: