మా పోరు : నందాజీ ! మీరు ఓడిపోయారా?

RATNA KISHORE
ఒక్క‌ద‌గ్గ‌ర ఓట‌మి అవ‌మానం కాదు ఎవ‌రిని వారు తెలుసుకునే అవ‌కాశం అని అన్నాడు ప‌వ‌న్. అవును!  ఈ మాట ఇద్ద‌రికీ వ‌ర్తిస్తుంది. అవ‌మానాలు దాటి వ‌చ్చాకే జాతీయ అవార్డు నీదిరా! వింటున్నావా!

చ‌దివే సుఖం గురించి తెలుసు అని చోట రాశారు ప్ర‌కాశ్ రాజ్. చ‌దివే సుఖం, రాసే ప్ర‌యాస ఈ రెంటి గురించి ఓ పుస్త‌క రూపాన వివ‌రించేందుకు, విస్త‌రించేందుకు ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌య‌త్నించారు. ఆ పుస్త‌కం దోసిట చినుకులు. ప్రకాశ్ రాజ్ లో మ‌రో పార్శ్వం. ఆయ‌నంత‌టి వ్య‌క్తి ఇంత చిన్న ప‌ద‌వికి పోటీ చేయ‌డం ఏంటి అని అనుకున్నాడు శివాజీ. ఆయ‌నంత‌టి స్థాయి ఇంకొక‌రు అందుకోగ‌ల‌రా అని అనుకున్నారు మ‌రో న‌టుడు. మంచి న‌టుడు అని రాయ‌డం వ‌ర‌కూ ఆయ‌నంటే అంద‌రికీ ఇష్టం. ప్ర‌వ‌ర్త‌న వాటి గ‌తిని నిర్దేశించి మాట్లాడితే ఆయ‌న చెడ్డ మ‌నిషి.. మంచి న‌టుడు.. ఏంటి ఇంత‌టి లోతు ద‌గ్గ‌ర న‌న్నుంచి మీరు మాట్లాడుతున్నారు అని అనుకుంటాడేంటో ప్ర‌కాశ్ రాజ్ . ఒక రోజు ఆయ‌న తో మాట్లాడి చూడండి.. అన్నీ తెలుస్తాయి. ఆయ‌న అహం భావం న‌చ్చ‌ని కార‌ణంగానే చాలా మంది ద్వేషిస్తారు. ఆ అహంభావం కార‌ణంగానే ఆయ‌న నిన్న‌టి వేళ ఓడిపోయారు.అలా అని గెలిచిన వాళ్లంతా ఉత్త‌ములా? అది కూడా ఆలోచించాలి. అవ‌త‌లి వాళ్ల ప్ర‌వ‌ర్త‌న‌నూ, న‌డ‌వ‌డినీ ఇంకాస్త కుదుట ప‌రిచే ప్ర‌య‌త్నం ఎవ్వ‌రైనా చేయ‌గ‌లిగారా?
బాగా డ‌బ్బులున్న కుటుంబాల‌కు మ‌న ఇబ్బందులు తెలుస్తాయా? కార్మికుడు అంటే ఓటున్న వాడు అని కాదు జీవితం పై బాధ్య‌త ఉన్న‌వాడు అని! మంచు విష్ణు కార్మికుల‌కు న్యాయం చేస్తాడ‌న్న మాట‌లో ఏదో తేడా ఉంది. అలా అని ప్ర‌కాశ్ రాజ్ చూడ‌ని జీవిత‌మా ఇది. సైకిల్ తొక్కుకుంటూ పోయి వేషాలు అడుక్కుని, నాట‌కాలు వేసిన రోజులున్నాయి ఆయ‌న‌కు. అంత‌టి క‌ష్టం విష్ణుకు లేదు. కానీ అంత‌కుమించిన బాధ్య‌త ఉంది. ఓడిపోవ‌డం అనే మాట‌లో ఎవ్వ‌ర‌యినా వెతికే అర్థాలు ఏమ‌యి ఉంటాయి. ఆయ‌న అహం ఓడిపోయింది. ఆయ‌న మ‌నిషిత‌నం ఓడిపోయింది. ఆయ‌న నమ్మిన విశ్వాసం ఓడిపోయింది. ఈ విధంగా చెప్ప‌డం మోనార్క్ ప్రకాశ్ రాజ్ కు న‌చ్చ‌దు. న‌వ్వుకుంటాడు. బెంగ‌ళూరు సెంట్ర‌ల్ లో ఓడిపోయాడు. భాగ్య‌న‌గ‌రంలో ఓడిపోయాడు. ఇంకొన్ని వ్య‌క్తిత్వాల ద‌గ్గ‌ర ఓడిపోయాడు. నేను చూడ‌ని శిఖ‌రమా ఇది అని న‌వ్వుకుంటాడు ఏమో!
విష్ణూ ! ఈ లోతు నీది ఈ లోకం నీది ఈ రంగు నీది ఈ రంగుల వెనుక నాట‌కం కూడా నీవే న‌డిపించు అని  చెప్పి వెళ్లాడు నిన్న. ఇది అర్థం ఇదే ధ్వ‌ని కూడా! ఛాయ కూడా! మ‌ళ్లీ బెంగ‌ళూరు పిలిస్తే వెళ్లిపోతాడు. చెన్న‌య్ ర‌మ్మంటే వాలిపోతాడు. ఆయ‌న‌ను ఎంద‌రో వద్దంటారు. ఆ విధంగా అన‌డ‌మే విజ‌యం. వ‌ద్ద‌నుకోవ‌డ‌మే గెలుపు. పోయి సాధించ‌డం సంపాదించ‌డం అన్న‌వి ఆ త‌రువాత మ‌నంత‌ట మ‌నం చేయాల్సిన ప‌నులు. ఆయ‌న అంటారు చేయాల్సిన ప‌నులు చాలా ఉన్నాయి అని! ఓడిపోయాక చేసేదేం లేదు..గెలిచేవాడు చేయాల్సిందే మిగిలి ఉంది. మిగిలిన ప‌నుల్లో బాధ్య‌త‌లు ఉన్నాయి. వాటిని నీవు ఎలాంటి ఇగోల‌కు పోకుండా విష్ణుకు గుర్తు చేయు చాలు. అదే నీ గెలుపు. రేప‌టి గెలుపు కాగ‌ల‌దు.

నేను చాలా ఎత్తు నుంచి జీవితాన్ని చూశాను అని చెబుతారు ప్ర‌కాశ్ రాజ్. ఆ ఎత్తు నాది కాదు అని అంటూ నాన్న భుజాల‌పై కూర్చొని లోకాన్ని చూశానంటూ చెబుతారు ప్ర‌కాశ్ రాజ్. జీవితాన్ని అర్థం చేసుకోవ‌డంతో మొద‌లు, జీవితాన్ని ఇంకొక‌రి జీవితంతో భాగం చేసుకోవ‌డం వ‌ర‌కు మ‌నం నిరంత‌రం ఏదో ఒక‌టి కొత్త విష‌యం అనే వెలుగుకు బానిస‌లుగా మారిపోతాం. వెలుగు అనేది న‌ట‌న‌కు సంబంధించింది కాదు. వెలుగు అన్న‌ది జీవితం నుంచి జీవితం వ‌ర‌కూ ఉన్న వ్యాప్తి. ఇట్స్ ఎ ఎక్స్ పేన్ష‌న్ పాయింట్ ఫ‌ర్ మి. విస్తృతం అయిన ప్ర‌యోజ‌నాలు ద‌గ్గ‌ర ప‌ద‌వులు, వాటిని ఆనుకునే రాజ‌కీయాలు వికృతాలు విస్తృతం చేసే ఉంచుతాయి. మా ఎన్నిక‌ల్లో ఎన్నో వికృతాల‌కు మీరూ, అవ‌తలి వారూ కార‌కుల‌య్యారు. అది మ‌రిచిపోవడం కొద్ది రోజుల త‌రువాత జ‌రిగే ప‌ని. అప్ప‌టిదాకా మీరు గెలుపు, ఓట‌మి అన్న‌వి ప‌ట్టించుకోకుండానే ప్ర‌యాణించేందుకు ఇచ్చే ప్రాధాన్యంను ఇంకాస్త పెంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: