'మా' ఎన్నికలు: ట్రంప్‌, బైడెన్‌ రావడం ఒక్కటే తక్కువ..?

మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికలు ఈనెల పదిన జరగబోతున్నాయి. ఈ అసోసియేషన్‌లో కేవలం నటులు మాత్రమే ఉంటారు. ఇది సినిమా రంగానికి చెందిన పూర్తిస్థాయి అసోసియేషన్ కాదు.. నటీనటులకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. ఈ అసోసియేషన్‌లో ఇప్పటి వరకూ 900 మందికి పైగా మాత్రమే సభ్యులు ఉన్నారు. అంటే ఇది ఎంత చిన్న అసోసియేషనో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ఓటేసేది మహా అయితే 450 మంది అని చెబుతారు. గతంలో ఎప్పుడూ ఇంతకంటే ఎక్కువ మంది ఓటేసిన దాఖలాలు లేవు.

అయితే.. ఇప్పుడు ఈ ఎన్నికలకు జనరల్ ఎలక్షన్లను మించిన సందడి సాగుతోంది. మా అధ్యక్ష పదవి కోసం దక్షిణ భారత నటుడు ప్రకాశ్ రాజ్, మంచు మోహన్ బాబు కొడుకు విష్ణు బరిలో దిగడంతో పోటీ రంజుగా మారింది. అయితే ఏ ఎన్నికల్లోనైనా పోటీ సహజమే.. కానీ.. ఈసారి రెండు ప్యానళ్ల మధ్య విమర్శల డోసు పెరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా పార్టీల జోక్యం కూడా ఈసారి కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ మా ఎన్నికలపై పార్టీలు స్పందించలేదు.

కానీ ఈసారి ఈ ఎన్నికలపై జనసేన అధినేత పవన్ స్పందించడం.. అటు వైసీపీ ప్రభుత్వ పెద్దలు తమకు ఈ ఎన్నికలతో సంబంధం లేదని చెప్పాల్సి రావడం విశేషం. మరోవైపు.. బీజేపీ నాయకుడు.. సీవీఎల్ నరసింహారావు ఏకంగా పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ప్రకాశ్ రాజ్‌పై దేశ ద్రోహి, ధర్మ ద్రోహి అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆయన కూడా మా సభ్యుడే. ఆయన కూడా అధ్యక్ష పదవికి పోటీ చేసి.. తర్వాత ఉపసంహరించుకున్నారు.

ఇక నిన్న మాట్లాడిన మంచు విష్ణు తనకు మోడీతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పడం విశేషం. అంటే ఇప్పటికే ఈ ఎన్నికల అంశంలోకి జగన్‌నూ, కేసీఆర్‌నూ, కేటీఆర్‌నూ లాగేశారు. ఇప్పుడు మోడీనీ లాగుతున్నారు. పాపం.. ఇక అమెరికా నేతలు ట్రంప్, బైడెన్, రష్యా అధినేత పుతిన్ మాత్రం మిగిలారన్న జోకులు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: