తెలంగాణలో ‛దిల్’ఖుషీ!

Mekala Yellaiah
సబ్బండ వర్గాలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో కొన్ని వర్గాలకే న్యాయం జరుగుతోంది. నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పధ్నాలుగువందలమంది అసువులుబాసారు. వాళ్ల తలకాయలమాలను మెడగొల్సుగా వేసుకొని కేసీఆర్ రాజిర్కంజేస్తూ.. బడా కాంట్రాక్టర్లు, కార్పొరేట్లకే ప్రయోజనాలు కల్పిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రూ.2 లక్షలకోట్ల మూలధనం ఉన్న డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ ల్యాండ్ హోల్డింగ్ లిమిటెడ్(దిల్)కు వందలకోట్ల విలువైన భూములను అప్పనంగా కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. రూ.978 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.220 కోట్లకే రహస్యంగా దారాదత్తం చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి పంచేందుకు మనసు లేదుగానీ బడా సంస్థలకు మాత్రం వందలకోట్ల విలువైన భూములను ఇవ్వడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

హైదరాబాద్ మహానగరంలో ఎకరా భూమి రూ.100కోట్లు పలుకుతోంది. ఖరీదైన ప్రాంతాల్లో అంతకు రెట్టింపు ధర చెల్లించేందుకు కూడా స్థిరాస్తి, నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. అలాంటి ప్రదేశంలోనే ప్రభుత్వం సదరు సంస్థకు భూమిని అప్పనంగా దారాదత్తం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2013 లో అప్పటి ప్రభుత్వం బాచుపల్లిలోని ప్రభుత్వ భూములను వేలం వేసింది. ఓ సంస్థ భూములను దక్కించుకుంది. అయితే దీనిపై వివాదాలు చెలరేగాయి. కేసు హైకోర్టుకు చేరింది. ఆ నిర్మాణ సంస్థకు అప్పుడు చెల్లించిన నగదుతోపాటు వడ్డీ చెల్లించాలని, లేకపోతే అదే ధరకు భూములు కేటాయించాలని కోర్టు 2019లో ఆదేశించింది. దీంతో తమకు ఫిలింనగర్ లోని పది ఎకరాలు ఇవ్వాలని సదరు నిర్మాణ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. అడిగిందే తడవుగా ప్రభుత్వం ఆ పది ఎకరాల భూమిని కేవలం రూ.220 కోట్లకే కట్టబెట్టింది. 

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ లో భూములకు చాలా డిమాండ్ ఉంది. డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ ల్యాండ్ హోల్డింగ్ లిమిటెడ్(దిల్)కు పది ఎకరాల భూమిని అప్పనంగా కట్టబెట్టారు. రోడ్డు నిర్మాణంతో తమకు నష్టం వచ్చిందని సదరు సంస్థ ప్రభుత్వానికి చెప్పుకోగా, మరో నాలుగున్నర ఎకరాల భూమిని ప్రభుత్వం ఉదారంగా ఇచ్చింది. దీంతో సదరు సంస్థ దిల్ ఖుషీగా ఉంది. ఇప్పుడు అక్కడ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేందుకు గుట్టలను కూల్చుతున్నారు. గుట్టపై ఉన్న హనుమాన్ ఆలయాన్ని కూల్చివేసినా వివాదం రాకుండా మేనేజ్ చేశారు. దీనిపై బీజేపీ కూడా నోరు మెదపలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: