ఆ ఊరును సముద్రం మింగేస్తోంది!

Mekala Yellaiah
ఆంధ్రప్రదేశ్ లోని ఓ ఊరును సముద్రం మింగేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ క్రమంగా సముద్రంలో కలిసిపోతోంది. ఆ ఊరులో ఇప్పటి వరకు మూడు పాఠశాలలతో పాటు నాలుగు ఆలయాలు, రెండు ట్రావెలర్స్ భవనాలు సముద్రంలో మునిగిపోయాయి. ఉప్పెన సినిమాలో సముద్రపు ఒడ్డున కనిపించే ఓ గుడి కూడా ఇప్పుడు లేదు. రెండు దశాబ్దాల్లో వందల ఇండ్లు సముద్రగర్భంలో కలిసిపోయాయి. దశాబ్దంన్నర క్రితం సముద్రం కోత నివారించేందుకు నిర్మించిన జియో ట్యూబ్ కూడా ధ్వంసమైంది. దీంతో ముప్పు మరింత పెరిగింది. ప్రభుత్వం మాత్రం ఈ ముప్పును నివారించేందుకు మార్గాన్వేషణ చేస్తున్నట్టు చెబుతున్నా, ఆ దిశగా వేగవంతమైన చర్యలు తీసుకోవడంలేదు. సముద్రం ఒడ్డున నివసిస్తున్నవారు  ప్రాణభయంతో వణుకుతున్నారు. 

చేనేత వృత్తి నైపుణ్యానికి, అందమైన జాంధానీ చీరలకు నిలయమైన ఉప్పాడ ఇప్పుడు సముద్రపు అలల తాకిడికి అల్లాడుతోంది. సముుుద్రం ముందుకు
వస్తున్నకొద్దీ గ్రామస్తులు వెనక్కి వెళ్తూ ఇండ్లు నిర్మించుకుంటున్నారు. బంగాళాఖాతం తీరప్రాంతమైన ఉప్పాడలో చేనేత కార్మికులు, మత్స్యకారులు అత్యధికంగా ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ పన్నెండువేలమంది నివసిస్తున్నారు. 137 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన ఈ గ్రామంలో 3,190 ఇండ్లు ఉండేవి. ఇప్పటికే 40 హెక్టార్లకు పైగా భూమి సముద్రంలో కలిసిపోయింది. వందలమంది నిరాశ్రయులయ్యారు. వారంతా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 

ప్రతిరోజూ కెరటాలు వస్తూ ఇండ్లను తాకుతుండడంతో గ్రామస్తులు రాత్రి వేళలో గ్రామంలోని పాఠశాలలో నిద్రపోతున్నారు. తెల్లారి ఇండ్లలోకి వస్తున్నారు. పదేండ్ల నుంచి ఈ సమస్య వేధిస్తుండగా, నాలుగైదేండ్ల నుంచి మరింత పెరిగిపోయింది. కాకినాడ పోర్టు నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పాడ కోతకు గురవుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సముద్రపు అలలను అడ్డుకునేందుకు రూ.12.6 కోట్లతో జియో ట్యూబ్ ఏర్పాటు చేశారు. దీంతో 
కొంతకాలం పాటు సముద్రపు కోత నివారించబడింది. ఇప్పుడు ఆ ట్యూబ్ ఆనవాళ్లు కూడా లేకుండా ధ్వంసమైపోయింది. ఫలితంగా ఉప్పాడ మనుగడకే ముప్పు వాటిల్లుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: