అమెరికా, ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్ ఎందుకు ఆగ్రహంగా ఉంది?

Mekala Yellaiah
అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ మధ్య కుదిరిన ఓ ఒప్పందంపై ఫ్రాన్స్, చైనా దేశాలు భగ్గుమంటున్నాయి. అణు జలాంతర్గాముల సాంకేతికను ఆస్ట్రేలియాకు బదిలీ చేయడమే లక్ష్యంగా ‛ఆకుస్’ (AKUS) పేరుతో కుదిరిన రక్షణ ఒప్పందంతో ఫ్రాన్స్ విరుచుకుపడుతోంది. ఈ ఒప్పందాన్ని నిరసిస్తూ అమెరికా, ఆస్ట్రేలియాలోని తమ రాయబారులను ఫ్రాన్స్ వెనక్కి పిలిపించుకుంది. ఈ ఒప్పందంతో తమను మోసం చేయడమే కాకుండా అగౌరవపరిచారని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ ఎస్ లే డ్రియన్ వ్యాఖ్యానించారు. మరోవైపు చైనా కూడా అమెరికా, ఆస్ట్రేలియా వైఖరిని తప్పు పడుతోంది. ప్రచ్ఛన్న యుద్ధం నాటి మనస్తత్వానికి ఈ రక్షణ ఒప్పందం అద్ధం పడుతోందని మండిపడుతోంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించేందుకే ఈ ఒప్పందం కుదుర్చుకున్నారని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిని అమెరికా దీనిని ఖండిస్తోంది. 

దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, వివాదాస్పద పరిస్థితులను ఆపేందుకే ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గాముల సాంకేతికతను బదిలీ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఒప్పందంతో ఆస్ట్రేలియా చైనాకు శత్రువుగా మారింది. ఇప్పటికే ఫ్రాన్స్ ఆస్ట్రేలియాతో సంప్రదాయ జలాంతర్గాముల సాంకేతికను బదిలీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు ఆకుస్ ఒప్పందంతో ఇది రద్దు అయింది. ఈ ఒప్పందంపై తమకు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వకుండానే అమెరికా, ఆస్ట్రేలియా కుట్రపన్నాయని ఫ్రాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ రెండు దేశాలు చేసిన పనితో తమ మిత్ర దేశాలతో తీవ్రమైన సంక్షోభం వచ్చే పరిస్థితి వస్తోందని ఆందోళన చెందుతోంది. బ్రిటన్ కూడా అవకాశవాద ధోరణితో ఉండడం బాధకరమంటోంది. ఐదు దశాబ్దాలుగా అమెరికా ఏ దేశానికీ అణు జలాంతర్గాముల సాంకేతికతను బదిలీ చేయలేదు. ఇప్పుడు ఆస్ట్రేలియాకు బదిలీ చేయడం ఫ్రాన్స్, చైనాకు నచ్చడంలేదు. 

ఆకుస్ ఒప్పందంతో ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గాములను అభివృద్ధి చేసుకునే శక్తి వస్తుంది. సంప్రదాయ జలాంతర్గాముల కంటే అణు జలాంతర్గాములు విధ్వంసకర దాడులు చేస్తాయి. అవి నీటి అడుగున చాలా రోజుల వరకు ఉంటాయి. సుదీర్ఘ ప్రాంతాల్లోని లక్ష్యాలపై కూడా దాడులు చేస్తాయి. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్, రష్యా వద్ద మాత్రమే అణు జలాంతర్గాములు ఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన ఆస్ట్రేలియా చేరింది. దీంతో ఫ్రాన్స్, చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: