ఎవరికి వరం- ఎవరికి శాపం

ఎవరికి వరం- ఎవరికి శాపం
జల్, జంగిల్, జమీన్ల పై అధికారం ఉన్న వాళ్లు ఆదివాసీలు. వారు  స్వతంత్రులు, ఆదివాసీ ప్రాంతాలపై వారికి రాజ్యాధికార హక్కులున్నాయి. ఆదివాసీ హక్కుల చరిత్రకు రాజ్యాంగ ఆమోదం కూడా ఉంది. అంతే కాదు ఐక్యరాజ్య సమితి ఆమోదం కూడా ఉంది. ఆదివాసీల హక్కులు కాపాడాలని ఐక్యరాజ్య సమితి పదే పదే ప్రపంచ దేశాలకు విజ్ఞప్తులు చేస్తూనే ఉంది.
పోలవరం ప్రాజెక్టు పై సంవత్సరాలుగా మేథావులు, వివిధ రాజకీయ వర్గాలు, నిర్వాసితులు, ముఖ్యంగా అడవి తల్లిని నము్మకున్న ఆదివాసీలు  ఎన్నో అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. పోలవరం  ఒక జాతీయ ప్రాజెక్టు ఇది పూర్తయితే ఎన్నో ప్రయోజనాలుంటాయి. ఇది బహుళార్ద సాధక ప్రాజెక్టు. దీని నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కాకినాడ నుంచి,. విశాఖపట్టణం వరకూ నిర్మిస్తున్న పలు పరిశ్రమలకు నీళ్లు అందుతాయి డెల్టా ప్రాంతంలో అదనంగా భూమి సాగులోకి వస్తుంది. ఎక్కువ పంటలు పండించ డానికి వీలవుతుంది. వేలాది ఎకరాలకు మూడో పంటకు నీరందించడం సాధ్యపడుతుంది. మున్నూట అరవై అయిదు రోజులూ  భూములు పచ్చగా కళకళలాడుతుంటాయి. ఇదీ పాలకులు చేసిన, చేస్తున్న కంటితుడుపు  ప్రకటన.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఆదివాసీల గోడు మాత్రం ఎవరికీ పట్టడం లేదు. అంతే కాదు చత్తీస్ గడ్, ఒడిశా రాష్ట్రాల గోడు కూడా వినే వాడు లేడు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై ఒడిశా, చత్తీస్ గడ్ రాష్ట్రాలు సుప్రీం కోర్టులో పిటిషన్లు వేశాయి. అవి వివిధ దశల్లో ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మూడు వేల గ్రామాలే కాదు, మూడు లక్షల మంది ఆదివాసీలు కూడా మనుగుతారు. నిరాశ్రయులవుతారు. ఒక నది చరిత్రలో మిగిలి పోతుంది. వివరంగా  చెప్పాలంటే శబరి నది అదృశ్యమవుతంది.  భారత్ లో మాత్రమే లభించే విలువైన వన మూలికలు, ఔషధ మొక్కలు విధ్వంసానికి గురవుతాయి. అంతే కాదు ఎంతో జీవరాశి  నశిస్తుంది.   స్పష్టంగా చెప్పాలంటే ఈ ప్రాజెక్టు ఒక పర్యావరణ విధ్వంసం. దీనిపై సుప్రీం కోర్టులో  ఎన్నో ఫిర్యాదులున్నాయి.
పోలవరానికి సంబంధించిన ఏ విషమైనా పతికలకు వార్తవుతుంది. మేథావులక చర్చనీయాంశ మవుతుంది. చట్ట సభల్లో అధికారక ప్రతిపక్ష సభ్యులు వాదులాడుకోవడానికి పనికి వస్తుంది. ఎవరికి కూడా ఆది వాసీల గోడు పట్టదు.
 ఆది వాసీల ఉనికి, జీవన శైలి, సంస్కృతి సంప్రదాయాలు ఎవరికీ అక్కర లేదు కూడా. అప్పుడప్పుడూ తాము  కూడా రాజకీయాల్లో ఉన్నామని చెప్పుకునే వివిధ పార్టీల నేతల ధర్నాలు చేస్తుంటారు.  అలా తమ ఉనికిని  కాపాడుకుంటుంటారు. తాజాగా సి.పి.ఎం పార్టీ కూడా పోలవరం నిర్వాసిత గ్రామంలో సభ నిర్వహించింది.  తూర్పు గోదావరి జిల్లా రేఖపల్లి అనే గ్రామంలో జరిగిన సభకు ఆ పార్టీ రాష్ట్ర నేలతోపాటు, కేంద్ర నేతలు కూడా  వచ్చారు. సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ ఈ సభలో కీలక ప్రసంగం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తున్నాయని విమర్శలు గుప్పించారు. నిర్వాసితులకు పరిహారం అందించాకే ప్రాజెక్టు పనులుపూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు ప్రభుత్వాలు   తీసుకోవాలని కూడా ఆమె తన ప్రసంగంలో కోరారు.   ఈ కార్యక్రమంలో మాజీ ఎం.పీలు బాబూరావు, మధు తదితరులు పాల్గోన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: