పోలీసులు అనుకున్నదే చేశారా...?

సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారి పై అత్యాచారం చేసి... క్రూరంగా హత్య చేసిన నిందితుడు రాజు కధ ముగిసింది. అతని మృతదేహాన్ని జనగాం సమీపంలో రైల్వే ట్రాక్‌పై గుర్తించిన పోలీసులు చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా అది రాజుదే అని వెల్లడించారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు విజయం సాధించారా... ఓడారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సరిగ్గా వినాయకచవితి ముందు రోజున 9వ తేదీ గురువారం రాత్రి చిన్నారిపై హత్యాచారం ఘటన బయటకు వచ్చింది. అదే రోజు రాత్రి సింగరేణి కాలనీ వాసులు న్యాయం కోసం పెద్ద ఎత్తున పోలీసులపై దాడి కూడా చేశారు. అప్పుడే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లే అని పోలీసులు కొట్టిపారేశారు. ఆ తర్వాత రోజు స్వయంగా కలెక్టరే చిన్నారి తల్లిదండ్రులకు పరిహారం అందించేందుకు వెళ్లినప్పుడు కూడా నిందితుడుని అప్పగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. అప్పుడు కూడా తగిని న్యాయం చేస్తామనేది పోలీసుల సమాధానం.
ఈ కేసు నెమ్మదిగా రాజకీయ రంగు పులుముకోవడం... అటు సెలబ్రెటీలు కూడా ఘాటుగా స్పందించడంతో పోలీసులకు కాస్త తలనొప్పిగానే మారింది. మన ఇంటి ఆడపిల్లలను బయటకు పంపగలమా అంటూ మహేష్ బాబు ట్విట్ చేసిన తర్వాత సెలబెట్రీల నుంచి సామాన్యుల వరకు గొంతు కలిపారు. మంత్రి మల్లారెడ్డి అయితే ఎన్‌కౌంటర్ చేస్తామని కూడా ప్రకటించారు. ఇక మరో మంత్రి కేటీఆర్ అయితే పోలీసుల అదుపులోనే నిందితుడు ఉన్నాడని ప్రకటించారు కూడా. దీనిపై కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇక పోలీసులు అయితే... నిందితుడిపై ఏకంగా పది లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు. గాలింపు కోసం ఏకంగా వెయ్యి మంది పోలీసులు రంగంలోకి దిగారు. అన్నీ బస్సుల వెనుక, వైన్ షాపుల వద్ద, సోషల్ మీడియాలో ప్రచారం చేశారు కూడా. అయితే ఇదంతా డ్రామా అని పోలీసుల తీరు గమనించిన వారి గుసగుసలు కూడా. ఏదో చేసేందుకే ఇలా సీన్ క్రియేట్ చేస్తున్నారనే పుకార్లు కూడా వినిపించాయి.
దిశ హత్యాచారం కేసులో నిందితులను అప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఎన్‌కౌంటర్ చేశారు. అప్పుడు అంతా ఆహా ఓహో అన్నారు. కానీ మానవహక్కుల సంఘం మాత్రం ఇది అన్యాయం అంటూ కేసు నమోదు చేసింది. కొంత మంది ప్రజా సంఘాల నేతలు హంతకుల కుటుంబాల తరఫున వకాల్తా పుచ్చుకున్నారు. కావాలనే ఎన్‌కౌంటర్ చేశారని... ఇది ముమ్మాటికీ పోలీస్ హత్య అని వాదించారు. ఘటన జరిగి ఇన్నేళ్లు అవుతున్నా కూడా ఈ కేసు విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది. సీపీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బదిలీ అయినప్పటికీ... కేసు విచారణ కోసం కోర్టుకు హాజరవుతూనే ఉన్నారు. రాజు విషయంలో కూడా ఎన్‌కౌంటర్ చేయాలనే డిమాండ్ వినిపించినప్పటికీ... ఎందుకు వచ్చిన తలనొప్పి అని పోలీసులు వెనక్కి తగ్గినట్లున్నారు. అందుకే ఆత్మహత్యగా చిత్రీకరిస్తే ఏ సమస్య రాదని భావించి ఈ పని చేసి ఉంటారనేది ప్రజాసంఘాల ఆరోపణ. ఇలా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని చూపిస్తే... అంతటితో కేసు క్లోజ్ అవుతుంది. అదే ఎన్‌కౌంటర్ చేస్తే... దిశ కేసు మాదిరి కోర్టుల చుట్టూ తిరగాలి. పోనీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపింతే... అదేదో సినిమాలో చెప్పినట్లు... జైలులో టైమ్‌కు పుడ్, సెక్యూరిటీ, కోర్టుకు వచ్చినప్పుడు, వెళ్లేటప్పుడు బందోబస్తూ వీటితో పాటు ఎన్నో ఆరోపణలు. వీటన్నిటి కంటే... ఇదే బెటర్ అని పోలీసులు భావించి... సైలెంట్‌గా పని కానిచ్చేసినట్లున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా... ఓ పసి మొగ్గను అత్యంత పాశవికంగా హత్య చేసిన నరరూప రాక్షసుడి కధ ఈ విధంగా ముగిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: