టీమిండియాకు నయా సారధి...?

టీమిండియాకు కొత్త కెప్టెన్ రానున్నాడా అంటే... అవుననే తెలుస్తోంది. ప్రస్తుతం భారత పురుషుల క్రికెట్ జట్టుకు సారధ్యం వహిస్తున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ... సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వన్డే, టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్నాడని వార్తలు వస్తున్నాయ్‌. ఈ విషయంరపై విరాట్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ తర్వాత.. భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించే అవకాశం కనిపిస్తోంది. తన బ్యాటింగ్ పర్ఫామెన్స్ పైన దృష్టి పెట్టేందుకే.. కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే.. టెస్ట్‌ కెప్టెన్‌గా మాత్రమే కొనసాగనున్నారు.
విరాట్ కోహ్లీ.. ఈ మధ్య ఫామ్ లేమితో చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డారు. విరాట్ కోహ్లీ ఫామ్ పై అతని అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో విరాట్ కోహ్లీ ఒకడు. మూడు ఫార్మాట్లలోనూ అద్భుతమైన కెరీర్ రికార్డు కలిగిన విరాట్ కోహ్లీ.. ఏ క్షణాన్నైనా గేమ్ స్వరూపాన్నే మార్చగలడు. అలాంటి విరాట్ కోహ్లీ.. ఈ మధ్య ఫామ్ లేమితో చాలా ఇబ్బంది పడుతున్నాడు.
రన్ మెషిన్‌గా పేరున్న విరాట్ కోహ్లీ... ఇంగ్లండ్ పర్యటనలో ఒకే తరహా బంతికి ఔటవ్వడం అందరనీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా ఆఫ్ సైడ్ బంతుల్ని వెంటాడి మరీ ఔట్ అవుతున్నాడు. ఈ లోపామే విరాట్ కోహ్లీ ఫెయిల్యర్‌కు ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ లో కూడా ఈ గణంకాలే అతని లోపాన్ని ఎత్తి చూపుతున్నాయ్. గత పది ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ ప్రదర్శన మరీ తీసికట్టుగా ఉంది. ఒక హాఫ్ సెంచరీ తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ ఆట ఆడలేదు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకునే విషయంలో కోహ్లీకి మంచి రికార్డు ఉన్నది. ఎన్నో సార్లు ఒంటి చేత్తో ఇన్నింగ్స్‌లను చక్కదిద్దాడు. కానీ.. ఇంగ్లాండ్ టూర్‌లో మాత్రం జట్టు కష్టాల్లో ఉన్నా.. బ్యాటింగ్‌లో చేతులు ఎత్తేశాడు. అసలు విరాట్ సెంచరీ చేసింది 2019 నవంబర్‌లో. అది కూడా బంగ్లాదేశ్ పైన.
కోహ్లీ అంతర్జాతీయ ఫార్మాట్‌లో సెంచరీ చేయక ఇప్పటికి 650 రోజులకు పైనే అవుతోంది. చివరి సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ సగటు కేవలం 23 కూడా లేదు. అంతే కాకుండా అన్ని ఫార్మాట్లు కలిపి 50కి పైగా ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ చేసింది నాలుగు అర్దసెంచరీలు మాత్రమే. పరుగుల యంత్రం అని పేరు తెచ్చుకున్న కోహ్లీ వైఫల్యాలు భారత జట్టుకు కూడా భారంగా మారుతున్నాయి. కీలక సమయంలో వికెట్ పారేసుకోవడం అభిమానులను చికాకు పెడుతున్నది. రాబోయే టీ20 వరల్డ్ కప్ ముందు కోహ్లీ ఇలాంటి పేలవ ఫామ్‌లో ఉండటం జట్టుకు మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు మాజీ క్రికెటర్లు.
గత ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా ఓడినప్పటి నుంచి విరాట్ కోహ్లీపై విమర్శల పరంపర కొనసాగుతోంది. సెమీస్‌లో ఓటమికి కెప్టెన్ కోహ్లీ-వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య నెలకొన్న విభేదాలే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. జట్టులోని ఆటగాళ్లు కోహ్లీ వర్గం, రోహిత్ శర్మ వర్గంగా రెండుగా చీలిపోయారని, సమిష్టిగా రాణించడంలో విఫలం చెందారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయ్‌. కొహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమైతే... ఆరంభ దశలోనే వాటిని పరిష్కరించడం మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు సీనియర్లు. లేనిపక్షంలో జట్టుపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశముందని భావిస్తున్నారు. ప్రపంచకప్ తర్వాత భారత జట్టు కెప్టెన్‌గా కొహ్లీని తప్పించి మరొకరికి బాధ్యతలు అప్పగించాలన్న వాదన కూడా తెరమీదకు వచ్చింది. రోహిత్ శర్మకు భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది.
విరాట్ కొహ్లీని టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా కొనసాగిస్తూ... రోహిత్ శర్మకు వన్డే, ట్వంటీ20 మ్యాచ్‌లకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అంశంపై బీసీసీఐ గతంలోనే పరిశీలన చేసింది. పరిమిత ఓవర్ల టోర్నీలకు రోహిత్ శర్మ కెప్టెన్సీ వహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్న అభిప్రాయం అప్పుడు వచ్చింది. అయితే.. ఈ ప్రతిపాదనను రోహిత్ ఫ్యాన్స్ స్వాగతిస్తుండగా... కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. జట్టును సెమీస్‌ వరకు తీసుకెళ్లిన విరాట్ కోహ్లీని.. పరిమిత ఓవర్లకు కెప్టెన్‌గా పరిమితం చేయాలన్న ప్రతిపాదన సరికాదంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: