మన దగ్గర కూడా ఎయిర్ స్ట్రిప్‌లున్నాయి..‍!

రాజస్థాన్‌లోని సత్తా-గాంధావ్ పట్టణాల మధ్య 925వ నంబర్ జాతీయ రహదారిపై 3 కిలోమీటర్ల పొడవైన ఎమర్జెన్సీ  ఎయిర్ స్ట్రిప్‌ను సరిగ్గా రెండు రోజుల క్రితం దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరి ప్రారంభించారు. ఆ సమయంలో దేశ ప్రజలంతా అహా ఓహో అనేశారు. ఎంతో గొప్ప విషయం అనేశారు కూడా. అలాంటివే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఉన్నాయని ఎవరైనా అంటే... ఎక్కడా అని కూడా అడిగేస్తున్నారు. వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు.
అత్యవసర సమయంలో యుద్ధ విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యేందుకు ఎయిర్ స్ట్రిప్ రన్ వేలను జాతీయ రహదారులపై నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా తీర ప్రాంతాలకు సమీపంలో ఉండే జాతీయ రహదారులపై వీటిని నిర్మించాలని రక్షణ శాఖ రవాణా శాఖను కోరింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే రెండు ఎయిర్ స్ట్రిప్‌లను నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా నిర్మించింది. ఇవి రెండు కూడా ప్రకాశం జిల్లాలోనే ఉండటం విశేషం.
చిలుకలూరిపేట - నెల్లూరు మధ్య జాతీయ రహదారి తీర ప్రాంతానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అందుకోసమే ప్రకాశం జిల్లాలోని ముప్పవరం వద్ద ఒకటి, సింగరాయకొండ సమీపంలో మరో ఎయిర్ స్ట్రిప్‌ను నిర్మించింది కేంద్ర ప్రభుత్వం. అద్దంకి సమీపంలోని ముప్పవరం వద్ద 4.1 కిలోమీటర్ పొడవుతో 33 మీటర్ల వెడల్పులో సిమెంట్ ఎయిర్ స్ట్రిప్‌ను సిద్ధం చేశారు అధికారులు. అలాగే సింగరాయకొండకు కేవలం కిలోమీటర్ దూరంలో 3.6 కిలోమీటర్ల పొడవుతో 33 మీటర్ల వెడల్పుతో మరో ఎయిర్ స్ట్రిప్ రెడీ చేశారు. ఈ ఎయిర్ స్ట్రిప్‌లు రెండూ కూడా ఎలాంటి మలుపులు లేకుండా స్ట్రెయిట్ లైన్ మాదిరి సిమెంట్‌తో నిర్మించారు. వీటి పక్కనే వాహనాల రాకపోకల కోసం అప్రోచ్ రోడ్డు కూడా ఏర్పాటు చేశారు అధికారులు.
తీర ప్రాంతానికి అతి సమీపంగా ఉన్న ప్రదేశాలు కావడంతో ఈ రెండు ప్రాంతాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో సిద్ధమైన ఈ రెండు స్ట్రిప్‌లను ఎయిర్ ఫోర్స్ అధికారులు తనిఖీ చేసి సర్టిఫై చేశారు కూడా. అత్యవసర సమయాల్లో ఈ ఎయిర్ స్ట్రిప్‌లను వినియోగిస్తారు. తుపాన్లు, ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం, సైన్యం సహాయం తీసుకునేందుకు, అలాగే ఆహారం, ఇతర సామాగ్రిని వేగంగా చేరవేసేందుకు ఈ ఎయిర్ స్ట్రిప్‌ల పైన విమానాలు ల్యాండ్ అవుతాయి.

 
దేశ వ్యాప్తంగా మొత్తం 25 ఎయిర్ స్ట్రిప్‌లను జాతీయ రహదారుల శాఖ నిర్మిస్తోంది. ఈ ఎయిర్ స్ట్రిప్‌ల వద్ద మధ్యలో ఎలాంటి డివైడర్‌లు నిర్మించరు. అలాగే రోడ్డుకు రెండు వైపులా కూడా సిమెంట్ గ్రిల్స్ ఏర్పాటు చేస్తారు. ఎలాంటి జంతువులు కూడా జాతీయ రహదారిపై రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సింగరాయకొండ, ముప్పవరం వద్ద ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్స్‌ను నిర్మిస్తోంది ఎయిర్ ఫోర్స్ శాఖ. త్వరలోనే ఈ రెండు ఎయిర్ స్ట్రిప్‌లపై కూడా విమానాలతో టెస్ట్ రన్ నిర్వహించనుంది ఎయిర్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: