తాలిబాన్లతో భారత్ కు తలనొప్పులేనా?

Mekala Yellaiah
అఫ్గానిస్తాన్ లో తాలిబాన్ల తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో పాకిస్తాన్ ప్రభావం కనిపించింది. అతివాద భావజాలమున్న రహ్ బరీ షురా కౌన్సిల్ అధినేత ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్ ను ప్రధానమంత్రిని చేశారు. ఆయన 2001లో బామియాన్ లో బుద్ధుడి విగ్రహాలను ధ్వంసం చేశారు. పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ అధిపతి జనరల్ ఫైజ్ హమీద్ మూడురోజులపాటు కాబుల్ లో ఉండి ప్రధానమంత్రి ఎన్నికను జరిపించారు. ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదిగా గుర్తించిన, బామియాన్ లో బుద్ధుడి విగ్రహాలను కూలదోసిన వ్యక్తి ప్రభుత్వాన్ని నడపబోతున్నాడు. 

ఇక హోంమంత్రిగా కరడుగట్టిన హక్కానీ నెట్ వర్క్ అధినేత సిరాజుద్దీన్ కు బాధ్యతలు అప్పగించారు. ఇది భారత దేశానికి ఆందోళన కలిగించే విషయమని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంతో పాటు అంతర్జాతీయ ప్రతినిధులతో చర్చలు జరిపిన దోహా కేంద్రంగా పనిచేసిన తాలిబాన్లు కొత్త కేబినేట్ లో లేరు. అందులో కాందహార్, హక్కానీ నెట్ వర్కుకు చెందిన తాలిబాన్ల ఆధిపత్యం కనిపిస్తోంది. ఇందులో ఆరుగురు మంత్రులు పాకిస్తాన్ లోని జామియా హక్కానియా సెమినరీలో చదువుకున్నారు. సిరాజుద్దీన్ హక్కానీ పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ ప్రియతమ నాయకుడిగా ఉన్నాడు. ఆయన 2008లో కాబుల్ లోని భారత దౌత్య కార్యాలయంపై దాడికి కుట్రపన్నాడని ఆరోపణలున్నాయి. 2009లో భారతీయులపై హక్కానీ నెట్ వర్క్ దాడులు చేసింది. 

సిరాజుద్దీన్ ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. ఆయనను పట్టించినవారికి ఐదు మిలియన్ డాలర్ల రివార్డు ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ కూడా ప్రకటించింది.  ఇప్పుడు హక్కానీ నాయకులకు అఫ్గానిస్తాన్ కొత్త ప్రభుత్వంలో పదవులు దక్కడం భారతదేశానికి ఎదురుదెబ్బేనని నిపుణులు చెబుతున్నారు. అఫ్గానిస్తాన్ భద్రతా వ్యవహారాలను సిరాజుద్దీన్ హక్కానీ చూసుకుంటాడు. రాష్ట్రాలకు గవర్నర్లను ఆయనే నియమిస్తాడు. అంటే ఐఎస్ఐకి కూడా ఇందులో ముఖ్య పాత్ర ఉంటుంది. ఇది భారతదేశానికి ముప్పు తెచ్చే పరిణామమని నిపుణులు అంటున్నారు. దీనిని పాక్ విజయంగా అభివర్ణిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: