పీవీ, వీవీ నావాళ్లే.. మీకేంది నొప్పీ..!

Mekala Yellaiah
స్వాతంత్ర్యానంతరం దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందనుకుంటే ఆధిపత్య కులాలకు చెందిన వారు రాజులుగా చలామణి అవుతున్నారు. ప్రజాస్వామ్యం ముసుగులో రాజరికం చేస్తూ అరాచక విధానాలను అవలంభిస్తున్నారు. నిచ్చెన మెట్ల కుల సంస్కృతిని కాపాడుతున్నారు. అగ్రకుల అనుకూల దృక్పథంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. నాటి పీవీ నుంచి నేటి కేసీఆర్ వరకు ఈ రహస్య ఎజెండా అమలు చేస్తున్నారు. ఇది కాళోజి నారాయణరావు మాటల్లో ఎప్పుడో బయటపడింది. ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు దక్కిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ‛ఏలెటోళ్లు మావోళ్లే.. మేమేమైనా పొందుతం.. ఎంతైనా అనుభవిస్తం..’ అనే అర్థాన్ని ఇచ్చే తీరులో ప్రతిధ్వనించాయి. 1991లో పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాళోజీకి పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చి, కులాభిమానాన్ని చాటుకున్నారు. అప్పుడు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వరంగల్ కలెక్టర్ కార్యాలయానికి ఫోన్ వచ్చింది. పలానా సమయానికి కాళోజీ నారాయణరావును కలెక్టర్ కార్యాలయంలో సిద్ధంగా ఉంచాలని, ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఆయనతో మాట్లాడతారని ఆ ఫోన్ ద్వారా ఆదేశాలు అందాయి. దీంతో కలెక్టర్ సహా జిల్లా అధికారులు ఉరుకులు పరుగులు మొదలుపెట్టారు. అప్పటికప్పుడు జిల్లా అధికారి ఒకరిని కాళోజి ఇంటికి పంపించారు. రెండు రోజుల తరువాత ఇంటికి కారు పంపిస్తామని, హనుమకొండలోని సుబేదారిలో గల కలెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్తామని ఆ అధికారి కాళోజీకి చెప్పారు. 

అనుకున్న విధంగానే అప్పటి హనుమకొండ ఆర్డీవో అంకయ్య కాళోజి నారాయణరావు ఇంటికి వెళ్లి, ఆయనను కారులో కలెక్టర్ బంగ్లాకు తీసుకొచ్చారు. ఆయనను కలెక్టర్ ప్రత్యేక గదిలో కూర్చోబెట్టి, స్పెషల్ ఇరానీ చాయ్, బిస్కెట్లతో ప్రత్యేక మర్యాదలు చేశారు. కొద్దిసేపటి తరువాత ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ముందుగా పీఎంవో అధికారులు జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. కాళోజి వచ్చిన విషయాన్ని తెలుసుకొని, రిసీవర్ ఆయనకు ఇవ్వాలన్నారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడతారని, లైన్ లో ఉండాలని చెప్పారు. కొద్ది క్షణాల్లోనే ప్రధానమంత్రి పీవీ నరసింహారావు లైన్ లోకి వచ్చి మాట్లాడారు. దీంతో కాళోజి ముఖంలో వెలుగులు కనిపించాయి. యోగక్షేమాలు, బంధుమిత్రుల కుశల ప్రశ్నలు ముగిశాక.. ‛ఒకటి అడుగుతాను.. ఒప్పుకుంటానని మాట ఇవ్వు’ అని పీవీ నరసింహారావు కాళోజీని అడిగారు. ‛విషయం ఏందో చెప్పకుండా మాట ఇవ్వు అంటే ఎట్ల.. ఏందో అడుగు చెప్త’ అని కాళోజి అన్నారు. ‛ఇది పూర్తిగా వ్యక్తిగతం. నీ ఆశయాలు, విశ్వాసాలకు సంబంధించింది కాదు. నీకు పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలనుకుంటున్నాను. మనం అధికారంలో ఉన్నప్పుడు, మనవాళ్లకు ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తరు. దీనిని కాదనకు.’ అని పీవీ నరసింహారావు అన్నారు. కొద్ది క్షణాలు ఆగిన కాళోజి సరే అని ఒప్పుకున్నారు. తరువాత అధికారులు కాళోజీని కారులో తీసుకెళ్లి ఆయన ఇంటి వద్ద దిగబెట్టారు. పీవీ నరసింహారావు పిలిపించిన సంగతేందని కుటుంబ సభ్యులు  కాళోజీని అడిగారు. దీంతో ఆయన జరిగిన విషయాన్ని వివరించారు. చదువుకునే రోజుల నుంచి స్నేహితుడైన పీవీ మాటను కాదనలేకపోయానని చెప్పారు. 

తరువాత కొద్దిరోజులకు కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవ్వబోయే అవార్డులను ప్రకటించింది. అందులో పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైనవారి జాబితాలో కాళోజి నారాయణరావు పేరు ఉంది. అయితే ఈ అవార్డును తిరస్కరించాలని విరసం నేత వరవరరావు కాళోజీని డిమాండ్ చేశారు. అప్పుడు చెన్నైలో ఉన్న వరవరరావు కాళోజీకి లేఖ కూడా రాశారు. దీంతో కాళోజి నారాయణరావు అవార్డు తీసుకుంటారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. విలేకరులు కాళోజి ఇంటికి వెళ్లి, అవార్డు తీసుకుంటున్నారా లేదా అని ప్రశ్నించారు. అప్పుడు ఆయన ‛అవార్డు ఇస్తానన్నవాడు పీవీ. తీసుకోవద్దన్నవాడు వీవీ. వీళ్లిద్దరూ నావాళ్లే. నడుమ మీకెందుకు నొప్పీ..’ అని అన్నారు. కాళోజి ఇంత ఖరాఖండిగా చెప్పాక విలేకరులు నోళ్లు మూసుకున్నారు. అవార్డు తీసుకుంటున్నానని కాళోజి చెప్పకనే చెప్పారు. రాజ్యాధికారం చేతిలో ఉంటే మన అనేవాళ్లకు ఏదైనా చేయవచ్చనేది ఈ ఉదంతంతో తెలిసిందని అప్పట్లో చాలా మంది వ్యాఖ్యానించారు. పీవీ నరసింహారావు ఏ హోదాలో ఉన్నా కాళోజీకి సంబంధించిన ఏ కార్యక్రమానికైనా హాజరయ్యేవారు. వారిది విడదీయరాని బంధంగా ఉండేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: