మహిళా క్రికెట్ జట్టు సభ్యులను తాలిబాన్లు చంపుతారా?

Mekala Yellaiah
అఫ్గానిస్తాన్ లో క్రికెట్ తో పాటు ఇతర ఆటలు ఆడుతున్న మహిళలు భయంతో వణుకుతున్నారు. అక్కడి మహిళల క్రికెట్ జట్టు సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లారు. వారంతా వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు సమస్యలు చర్చించుకుంటున్నారు. తాలిబాన్లు కాబుల్ ను ఆక్రమించుకున్నప్పటి నుంచి మహిళల క్రికెట్ జట్టు సభ్యులు బయట కనిపించడంలేదు. వారంతా క్రికెట్ కిట్లను దాచుకున్నారు. ఈ జట్టు సభ్యులను తాలిబాన్లు లక్ష్యంగా చేసుకొని గాలిస్తున్నారు. మహిళలు క్రికెట్ ఆడితే చంపేస్తామని బెదిరిస్తున్నారు. కొందరు మహిళా క్రీడాకారులు దేశం వదిలి పారిపోయారు. దేశం దాటిపోయే ముందు వారు వారంరోజులుగా రోజుకో ఇల్లు మారుతూ తాలిబాన్ల నుంచి తప్పించుకున్నారు. మహిళా క్రీడాకారుల తల్లిదండ్రులను తాలిబాన్లు వేధిస్తున్నారు. గత సంవత్సరం నుంచి అఫ్గానిస్తాన్ మహిళా క్రికెట్ జట్టులో మంచి ఆశలు చిగురించాయి. ఇప్పుడు వారు భద్రత గురించి భయాందోళన చెందుతున్నారు. క్రీడల అధికారులు కూడా వారి దుస్థితిని పట్టించుకోవడంలేదు. తాలిబాన్లు గతంలో క్రికెట్ పై నిషేధాన్ని విధించారు. 2001లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అఫ్గానిస్తాన్ కు అనుబంధ సభ్యత్వం కల్పించింది. తాలిబాన్ల శకం ముగిసిన తరువాత ఫుట్ బాల్, ఇతర క్రీడలతో పాటు క్రికెట్ కూడా అభివృద్ధి చెందింది. అఫ్గానిస్తాన్ ఇరవై ఏండ్లుగా యుద్ధాలతో సతమతమవుతోంది. ఆ దేశాన్ని సంతోషంగా ఉంచింది ఒక క్రీడలే. 2001 నుంచి ఆ దేశ పురుషుల క్రికెట్ జట్టు కూడా ప్రపంచ వేదికపై సత్తా చాటింది. 2015లో ప్రపంచ కప్ కు అర్హత పొందడంతో సంబరాలు చేసుకున్నారు. 2010లో మహిళా క్రికెట్ జట్టు ఏర్పడింది. అప్పటి నుంచి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఆ మహిళా జట్టును అంతర్జాతీయ వేదికలపై ఆడకుండా అడ్డుకుంది. తాలిబాన్ల బెదిరింపులతోనే మహిళలను ఆడనీయలేదు. ఆడవాళ్లు భావోద్వేగాలను నియంత్రించుకోవాలనే ఇలా అడ్డుకుంటున్నారు. గతంలో తాలిబాన్లు పాలించినప్పుడు బాలికలు, మహిళలు చదువుకోకుండా నిషేధం విధించారు. మగ తోడు లేకుండా మహిళలను ఇంటి నుంచి బయటకు వెళ్లనిచ్చేవారుకాదు. ఇప్పుడు మహిళలను క్రికెట్ ఆడనివ్వకపోవడమే కాకుండా, ఇంతకు ముందు జట్టు సభ్యులను చంపాలని చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: