‛అంతర్వేది రథం’పై సీబీఐ ఎందుకు విచారణ చేయడంలేదు?

Mekala Yellaiah
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో గల అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథం కాలిపోయి ఏడాది దాటిపోయింది. అయినా రథం ఎలా కాలిపోయిందో ఇప్పటికీ తేలడంలేదు. కేసును సీబీఐకి అప్పగించినా దర్యాప్తు మొదలుపెట్టడమేలేదు. రథం కాలిపోవడంతో  విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ ఆందోళనలు చేపట్టిన వివిధ పార్టీలు, సంఘాల నాయకులు ఇప్పుడు నోరు మెదపడంలేదు. ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించినా ఇప్పటి వరకు కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. దీంతో రథం ఎలా కాలిపోయిందనే గుట్టు అంతుచిక్కడంలేదు. 

గత ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన అర్ధరాత్రి దాటిన సమయంలో అంతర్వేది రథం మంటల్లో కాలిపోయింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సఖినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహియంతో విచారణ జరిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రథం కాలిపోయిందని ప్రాథమికంగా నిర్ధారించారు. తరువాత కొందరు తేనెతుట్టెకు మంటలు పెడితే రథానికి అంటుకొని కాలిపోయి ఉండొచ్చని ప్రచారం జరిగింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. బీజేపీ, జనసేన రాజకీయంగా విమర్శలు చేశాయి. కొందరు ఇతర మతాలకు చెందిన ప్రార్థనామందిరాలపై రాళ్లు వేశారు. వారిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. కొందరిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అంతర్వేది రథం కాలిపోకముందు నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో కొందరు పలు హిందూ ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేశారు. తరువాత అంతర్వేదిలో రథం కాలిపోయిన ఘటన పెద్ద వివాదంగా మారింది. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో డీజీపీ కార్యాలయం అదే ఏడాది సెప్టెంబర్ 10న కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. సీబీఐ దర్యాప్తు చేయాలని కోరింది. ఇక సీబీఐ దర్యాప్తు చేస్తే రథం ఎలా కలిపోయిందనేది తేలుతుందని అందరూ భావించారు. అయితే సీబీఐ మాత్రం అడుగు ముందుకు వేయడంలేదు. అసలు కేసు విచారణపై సీబీఐ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. దీంతో అంతర్వేది రథం ఎలా కాలిపోయిందనేది ఇప్పటి వరకూ అంతుచిక్కని వ్యవహారంగానే మిగిలిపోయింది. మొదట సీబీఐ దర్యాప్తునకు పట్టుబట్టిన రాజకీయ పార్టీలు ఇప్పుడు వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: