ఆధునాతన కోచ్‌లతో రైల్వే రెడీ

ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న భారతీయ రైల్వే... ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పాత బోగీల స్థానంలో సరికొత్త రైల్ కోచ్‌లను తయారు చేస్తున్న ఇండియన్ రైల్వే... తాజాగా మరో నూతన ఆవిష్కరణకు సిద్ధమైంది.  ఇప్పటికే విమాన ప్రయాణం అనుభూతిని అందిస్తున్న రైల్వే శాఖ... అటు వేగంలో కూడా ఎన్నో మార్పులు చేసింది. కుదుపులు లేని ప్రయాణాన్ని ప్రస్తుతం ఎన్నో మార్గాల్లో అందుబాటులోకి తీసుకువచ్చిన ఇండియన్ రైల్వే. ఇక ప్రయాణికుల సౌకర్యం కోసం ఎన్నో మార్పులు, చేర్పులు చేపట్టింది.
తేజాస్ పేరుతో అత్యాధునిక రైళ్లు నడుపుతున్న రైల్వే... డోమ్ కోచ్‌లతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ ఏసీ కోచ్‌లలో ఎన్నో మార్పులు చేసిన రైల్వే శాఖ... ఇప్పుడు థర్డ్ ఏసీ ప్రయాణీకుల కోసం అత్యాధునిక వసతులకో సరికొత్త కోచ్‌లను రెడీ చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏసీ 3 టైర్ కోచ్‌ల స్థానంలో ఎకనామిక్ క్లాస్ కోచ్‌ను అందుబాటులోకి తీసుకు రానుంది రైల్వే శాఖ. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన ఈ కోచ్‌లను ఉత్తరప్రదేశ్ - రాజస్థాన్ మధ్య నడిచే రైలులో మొదటి సారి ప్రవేశపెట్టింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ కోచ్‌లను ప్రవేశపెట్టినట్లు అధికారులు తెలిపారు.
సాధారణంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైళ్లలో కంటే కూడా ఎకనామిక్ క్లాస్‌ కోచ్‌లో ఎక్కువ మందికి అవకాశం ఉంది. అలాగే ఆకట్టుకునే ఇంటీరియర్ డిజైన్, సెపరేట్ ఏసీ సౌకర్యం, ఆధునాతన టాయిలెట్స్, విండో కర్టన్స్, స్పెషల్ డిజైన్ స్టెప్స్‌ ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి కోచ్‌లో కూడా భద్రత కోసం సీసీ కెమెరాలను బిగించారు. ఇక ప్రయాణీకుల కోసం రీడింగ్ టేబుల్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్, యూఎస్‌బీ డివైస్‌లను కూడా అందుబాటులో ఉంచారు.

అటు ధర విషయంలో కూడా ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఈ ధరలను నిర్ణయించారు అధికారులు. ప్రస్తుతం థర్డ్ ఏసీ ధరల కంటే కూడా టికెట్ ధర 8 శాతం తక్కువగా నిర్ణయించారు. మరిన్ని రైళ్లకు కూడా ఈ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇందు కోసం కపూర్తలాలో 50 కొత్త కోచ్‌లను తయారు చేస్తోంది రైల్వే శాఖ. త్వరలో న్యూఢిల్లీ నుంచి లక్నో ఏసీ స్పెషల్ మెయిల్‌కు ఈ కొత్త కోచ్‌లను అమర్చనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: