‛ప్రపంచపెద్దన్న’ను చిన్నతనంగా చూస్తున్నారా?

Mekala Yellaiah
ప్రపంచానికి నాయకత్వం వహిస్తూ, దేనిలోనైనా పెద్దన్న పాత్ర పోషించే దేశంగా పేరున్న అమెరికా ఆ ప్రతిష్టను కోల్పోతుందా? తాజా పరిణామాలు చూస్తుంటే ప్రపంచ దేశాలు అమెరికాను చిన్నతనంగానే చూస్తున్నాయని అర్థమవుతోంది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన తరువాత ఆయనపై చాలా దేశాలు ఎన్నో అంచనాలు పెట్టుకున్నాయి. బైడెన్ అధ్యక్ష పదవిని చేపట్టినప్పుడు ఆయన ‛అమెరికా తిరిగి పుట్టింది’ అని అన్నారు. ఆ మాటలు ఎన్నో దేశాలకు బలాన్ని ఇచ్చాయి. అమెరికాతో తమ సంబంధాల్లో ఇక స్వర్ణయుగమేనని భావించాయి. ప్రపంచ వ్యవహారాల్లో సరైన విధంగా వ్యవహరించే విషయంలో జర్మన్లు జో బైడెన్ పై 80 శాతం నమ్మకముంచారు. ఇంతకు ముందు ఉన్న డోనల్డ్ ట్రంప్ పై 10 శాతమే ఉంచారు. అయితే ఇప్పుడు జర్మన్ దేశమే కాదు, చాలా దేశాలు అమెరికా స్పందించే తీరుతో తక్కువగా అంచనా వేస్తున్నాయి. 

అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలను ఉపసంహరించుకోవడంపై మచ్చగా భావిస్తున్నాయి. ఈ విషయంలో ఇతర దేశాలతో చర్చలు జరపకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నాయి. ఇతర దేశాల పునర్నిర్మాణానికి తమ సేనలను పంపబోమని బైడెన్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్ విధానాన్ని ప్రతిధ్వనించాయి. ట్రంప్ ఎప్పుడూ అమెరికా ఫస్ట్ అనే విధానాన్నే అవలంభించేవారని, ఇప్పుడు బైడెన్ ఆ దారిలో వెళ్తున్నారేమోనని అనుమానిస్తున్నాయి. అమెరికా ప్రపంచ దేశాల నుంచి దూరంగా జరుగుతూ, తమ స్వదేశంలో విలువలను రక్షించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుందేమోనని యూరోప్ దేశాలు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అఫ్గానిస్తాన్ అంశంలో అమెరికా వ్యవహరించిన తీరుతో ఏకాకిగా ఉండాలనుకుంటుందా అనే కోణం కూడా ఉందంటున్నాయి. గ్లోబల్ ఆర్డర్ ను కాపాడాలని అమెరికా ఎప్పుడూ మాట్లాడేది. ఇప్పుడు వైట్ హౌస్ నుంచి అలాంటి మాటలు వినిపించడంలేదు. ట్రాన్స్ అట్లాంటిక్ సంబంధాలపై అంచనాలు తలకిందులయ్యాయి. దీంతో అమెరికా తనకు నచ్చిన తీరులోనే ఉంటుందేమోననే నిర్ణయానికి పలు దేశాలు వచ్చాయి. 

అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా వైదొలిగిన విషయంలో మిత్రదేశాలతో సరైన సమన్వయంతో ముందుకు వెళ్లలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికా అఫ్గానిస్తాన్ నుంచి వైదొలిగిన సమయంలో నాటో మిషన్ కు చెందిన 36 దేశాల సేనలు అక్కడే ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తరువాత మొదటిసారి జర్మనీ సేనలు యుద్ధం కోసం అఫ్గానిస్తాన్ వెళ్లాయి. అమెరికా సహా సేనలన్నీ తిరిగి వెళ్లడం గందరగోళానికి దారితీసింది. ఇది నాటోకు పెద్ద ఓటమిగా మిగిలింది. దీంతో ప్రపంచానికి నాయకత్వం వహించే దేశంగా ఉన్న అమెరికా తన ప్రతిష్టను కోల్పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: