శభాష్‌ పవన్.. ఇది చాలదు.. ఇంకాస్త పెంచాలి..?

పవన్ కళ్యాణ్‌.. జనసేన అధినేత.. యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు.. అయితే పార్టీ పెట్టి దాదాపు 7,8 ఏళ్లవుతున్నా ఇంకా బాలారిష్టాలు దాటన పార్టీగానే ఉంది. జనసేనానిగా పేరున్నా జనంలో లేకపోవడం వల్ల వచ్చి ఇబ్బందులు ఇవి.. ఏదో ఎన్నికల సమయంలో వచ్చి నాలుగు డైలాగులు చెబితే సరిపోదు.. జనం అంత సులభంగా నమ్మరు. మరి ప్రజలు నమ్మాలంటే ఏం చేయాలి.. జనం సమస్యలపై కొట్లాడాలి.. ఫలితం ఎలా ఉన్నా.. జనం గురించి పోరాడాలి.. అలాంటప్పుడే ఆ నాయకుడిపై జనానికి నమ్మకం కలుగుతుంది.

అయితే.. ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ ఇలాంటి ప్రయత్నం ఒకటి చేశారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద ఇచ్చిన పిలుపు సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయింది. పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపుతో కార్యకర్తలే కాదు.. సామాన్య ప్రజలు కూడా ఏపీలోని రోడ్ల దుస్థితి గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అలా ఈ కార్యక్రమం బాగా జనంలోకి వెళ్లింది.. జనం సమస్యలపై స్పందిస్తే.. జనం ఎలా రియాక్టవుతారో చెప్పేందుకు ఈ కార్యక్రమం ఓ ఉదాహరణగా చెప్పొచ్చు.

ఒక్క విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి.. ఈ కార్యక్రమం సూపర్ హిట్ అయినా.. ఇది కేవలం సోషల్ మీడియా వేదికగా సాగిన పోరాటమే.. ఇందులో స్పందించేవాళ్లంతా కాస్తో కూస్తో చదువుకున్న వాళ్లు.. సెల్‌ఫోన్లు అందుబాటులో ఉన్నవాళ్లు.. వాళ్లు స్పందిస్తేనే ఇంతగా స్పందన కనిపించింది. మరి ఇక సామాన్య జనం గురించి సామాన్య జనంలోకి వెళ్లి పోరాడితే ఇంకెలా ఉంటుంది.. ఈ విషయం గురించి జనసేనాని ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది.

ఓవైపు తెలుగు దేశం పార్టీ అంత చురుకుగా కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో జనసేన ప్రజాసమస్యలపై దృష్టి పెట్టిన జనంలోకి వెళ్తే.. మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది. అలాగే తెలుగు దేశానికి ప్రత్యామ్నాయంగా పార్టీ ఎదిగే అవకాశమూ కనిపిస్తోంది. అందుకే ఇక పవన్ కల్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం మరోసారి గుర్తు చేస్తోంది.. అందుకే.. పవన్.. ఈ డోసు సరిపోదు.. ఇంకాస్త పెంచాల్సిందే అంటున్నారు జనం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: