ఏపీలో భారీ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ ప్రాజెక్టును కేంద్రం కేటాయించింది. గత ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఇప్పుడు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు వరకు ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలని గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లాలంటే కనీసం 12 గంటల ప్రయాణ సమయం పడుతుంది. విజయవాడ నుంచి గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు మీదుగా ప్రస్తుతం బెంగళూరుకు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇది సుమారు 660 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ మార్గంలో విజయవాడ నుంచి నాయుడుపేట వరకు మాత్రమే స్వర్ణ చతుర్భుజిలో భాగంగా జాతీయ రహదారి ఉంది. కానీ... నాయుడుపేట నుంచి బెంగళూరు వరకు కూడా ప్రయాణం కాస్త ఇబ్బందిగానే సాగుతుంది.
2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం.... రాయలసీమ ప్రాంతానికి రాజధానికి మధ్య ప్రయాణ దూరం తగ్గించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకోసం అమరావతి నుంచి గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, నంద్యాల మీదుగా అనంతపురం వరకు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి సర్వే నిర్వహించింది. ఇందుకు సంబంధించిన భూ సేకరణ కూడా దాదాపు పూర్తి చేసిన గత ప్రభుత్వం. ఈ మార్గం రూట్ మ్యాప్ కూడా కేంద్రానికి పంపింది. అయితే... సరిగ్గా ప్రక్రియ అంతా పూర్తయ్యే సమయానికి బీజేపీతో తెలుగుదేశం పార్టీ విభేదించడం.. ఆ ప్రాజెక్టు కాస్త అటకెక్కింది. ఆ తర్వాత ఎన్నికలు రావడం... రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ ప్రాజెక్టు పూర్తిగా మరుగున పడిపోయిందని అంతా భావించారు.
తమ ప్రాంతంతో ముడిపడిన అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టు ఫైల్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దుమ్ము దులిపారు. దీనిపై కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ప్రత్యేకంగా లేఖలు రాశారు. ప్రాజెక్టు ఉపయోగాలను, లాభ నష్టాలను వివరించారు. అలాగే పూర్తిగా రాష్ట్రానికే పరిమితమైన ఈ ప్రాజెక్టును బెంగళూరు వరకు విస్తరించి... అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా మార్చారు వైఎస్ జగన్. దీనితో కేంద్ర సర్కార్... ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసేందుకు సిద్ధమైంది.
అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టును విజయవాడ - బెంగళూరు ‌ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టుగా మారుస్తూ కేంద్రం అనుమతించింది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టుకు కేంద్రం రవాణా శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే బెంగళూరు - హైదరాబాద్ మార్గం అనంతపురం వరకు వస్తుంది. అటు గుంటూరు - విజయవాడ మధ్య కూడా ఆరు వరుసల మార్గం ఉంది. ప్రస్తుతం గుంటూరు - అనంతపురం మధ్య మాత్రమే 360 కిలోమీటర్ల మేర ఆరు వరుసల జాతీయ రహదారి మాత్రమే నిర్మించాల్సి ఉంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే... విజయవాడ - బెంగళూరు మధ్య ప్రస్తుతం ఉన్న 660 కిలోమీటర్లకు బదులుగా 570 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. 90 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీని వల్ల ఎంతో ఇంధనం ఆదా అవుతుందని... అలాగే వెనుకబడిన రాయలసీమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని కేంద్రం వెల్లడించింది. భారత్ మాలా ఫేజ్-2లో భాగంగా 2023 నాటికి ఈ రోడ్  నిర్మాణం పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే... ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కూడా మారిపోతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: