ఏ‛దిశ’..?

Mekala Yellaiah
ఆంధ్రప్రదేశ్ లో మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ చట్టం పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడంలేదు. ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం-2019 ఏపీ దిశ యాక్ట్ అసెంబ్లీలో ఆమోదం పొంది రెండేండ్లవుతున్నా దాని ప్రభావం కనిపించడంలేదు. 2019 డిసెంబర్ లో హైదరాబాద్ లో దిశ సంఘటన తరువాత అదే నెలలో ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. దీంతో పాటు ‛ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగైనిస్ట్ వుమన్ అండ్ చిల్డ్రన్ యాక్ట్-2019’ కూడా అమలులోకి తెచ్చింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్లు 173, 309 ని  సవరించారు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లో అదనంగా 354(ఈ), 354(ఎఫ్‌) సెక్షన్లను చేరుస్తూ చట్టాన్ని రూపొందించారు. శాసన ప్రక్రియ పూర్తి చేసుకున్న ఈ చట్టంపై కేంద్ర ప్రభుత్వం నుంచి సందేహాలు వచ్చాయి. ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని కేంద్రం పార్లమెంటు లో చెప్పింది. తమ అభ్యంతరాలకు ఏపీ ప్రభుత్వం సమాధానం రాలేదని జులై 27న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇప్పపటికేదేశమంతా అమలు చేస్తున్న చట్టంలో సవరణలు చేయడంతో సమస్యలు వస్తాయని, దీనికి పరిష్కారం ఏమిటని కేంద్రం ప్రశ్నిస్తోంది. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)లో మార్పులు తీసుకురావడంతో.. చట్టం అమలు కోసం కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణతో అత్యాచార కేసుల్లో నేరం జరిగినట్టు ఆధారాలు ఉంటే, దోషులకు 21 రోజుల లోపే కోర్టులు మరణశిక్ష విధిస్తాయి. 
ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేయాలని చట్టంలో ప్రతిపాదించారు.  మహిళలపై దాడులు, వేధింపుల కేసుల్లో పోలీసుల దర్యాప్తు వారంరోజుల్లో ముగించాలి. పధ్నాలుగు రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసి, 21 రోజుల్లో తుది తీర్పు రావాల్సి ఉంటుంది. అయితే ఈ చట్టం తీసుకువచ్చినా మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొద్దిరోజుల క్రితమే గుంటూరులో బీటెక్ చదువుతున్న రమ్యను చంపారు. అంతకు ముందు ముఖ్యమంత్రి ఇంటి సమీపంలోనే తాడేపల్లి దగ్గర కృష్ణా నది ఒడ్డున లైంగిక దాడులు జరిగాయి. ఆంద్రప్రదేశ్ లో దిశ చట్టం అమలులోకి వచ్చిన తరువాత 400కు పైగా లైంగిక దాడులు జరిగాయి. అయితే నిందితులకు మాత్రం దిశ చట్టం కాకుండా గత చట్టాల ప్రకారమే శిక్షలు పడుతున్నాయి. అయితే హోంమంత్రి మేకతోటి సుచరిత మాత్రం ఏపీలో దిశ చట్టం అమలవుతోందని చెబుతున్నారు. ఆ చట్టం ప్రకారం కొందరికి మరణశిక్షలు కూడా పడ్డాయని చెప్పడం హాస్యాస్పదంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: