పంజ్ షీర్ ను ఆక్రమించడం తాలిబాన్ల తరం కాదా?

Mekala Yellaiah
అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్ కు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజ్ షీర్ లోయను ఆక్రమించడం తాలిబాన్ల తరం కావడంలేదు. కాబుల్ తో పాటు దేశాన్ని మొత్తం చేతిలోకి తీసుకున్న తాలిబాన్లకు ఇది కొరకరాని కొయ్యగా ఉంది. ఈ లోయలో కొన్ని వేలమంది తాలిబాన్ వ్యతిరేక పోరాట యోధులు ఉన్నారు. పంజ్ షీర్ లోకి వెళ్లేందుకు ఒకే దారి ఉంటుంది. 1980లలో సోవియట్ బలగాలను, 90లలో తాలిబాన్లను ఎదురించి నిలిచిన పంజ్ షీర్ ఇప్పుడు మళ్లీ తాలిబాన్లతో తలపడుతోంది. నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గానిస్తాన్-ఎన్ఆర్ఎఫ్ చేతిలో ఉన్న పంజ్ షీర్.. తాలిబాన్లు, సోవియట్ వ్యతిరేక ఫైటర్లకు కంచుకోటగా ఉంది. రెడ్ ఆర్మీతో పాటు తాలిబాన్లు ఈ లోయను ఆక్రమించేందుకు వస్తున్నా, అక్కడి యోధులు తిప్పికొడుతున్నారు. కాబుల్ నుంచి ఉత్తరాన నైరుతి నుంచి ఈశాన్యం వరకు 120 కిలోమీటర్ల దూరంలో ఈ లోయ విస్తరించి ఉంది. లోయ చుట్టూ ఎత్తైన పర్వతాలు పెట్టని కోటలా ఉన్నాయి. ఇవి ప్రజలకు రక్షణ కవచంలా ఉన్నాయి. ఈ లోయలోకి వెళ్లాలంటే ఒకే ఒక్క ఇరుకైన రోడ్డు ఉంది. అది నది మధ్య నుంచి, రాళ్లు తేలిన భూముల నుంచి వంకరటింకరగా సాగిపోతుంది. లోయలోకి వెళ్లాక, దానికి మరో పన్నెండు లోయలు అనుసంధానమై ఉంటాయని చెబుతారు. ప్రధాన లోయ దారి అంజొమెన్ పాస్ కు వెళ్తుంది. అక్కడి నుంచి తూర్పు దిక్కు ముందుకు సాగుతూ హిందూ కుష్ పర్వతాల వరకు వెళ్తుంది. గతంలో అలెగ్జాండర్, తామెర్లేన్ సైన్యాలు ఈ దారి నుంచే వెళ్లాయని చెబుతారు. ఈ లోయలో నిత్యం విలువైన ఖనిజాలను వెలికి తీస్తారంటారు. ఇప్పుడు ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ లు, విండ్ ఫామ్ ఉంది. అమెరికా సహాయంతో ఇక్కడ రోడ్లు, రేడియో టవర్ నిర్మించారు. 2001లో తాలిబాన్లు ఓడిపోయిన తరువాత ఈ లోయను జిల్లా నుంచి ప్రావిన్స్(రాష్ట్రం)గా మార్చారు. అఫ్గానిస్తాన్ లోని అతి చిన్న రాష్ట్రాల్లో ఇది ఒకటిగా ఉంది. ఈ లోయ స్వయంప్రతిపత్తి కలిగి ఉంది. స్థానికులనే ఇక్కడ గవర్నర్లుగా నియమిస్తారు. పంజ్ షీర్ లోయలో సుమారు రెండు లక్షల మంది ఉంటారు. వీరు తజిక్ జాతికి చెందినవారైనా, పొరుగున ఉన్న తజికిస్తాన్ వెళ్లేందుకు ఇష్టపడరు. వీరంతా దరి భాష మాట్లాడతారు. ఈ ప్రజలు చాలా ధైర్యవంతులు. వీరు తాలిబాన్లకు ఎప్పుడూ భయపడలేదు. ఇప్పుడు కూడా వారితో పోరాడతారు తప్ప లొంగిపోరని చెబుతున్నారు. ఇప్పుడు ఈ లోయలో అపారమైన ఆయుధాల నిల్వలు ఉన్నాయని భావిస్తున్నారు. తాలిబాన్ల వ్యతిరేక దళాలకు 32 ఏండ్ల యువకుడు అహ్మద్ మసూద్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో తాలిబాన్లపై పోరాడిన అహ్మద్ షా మసూద్ కొడుకు. అఫ్గాన్ సైన్యం, ప్రత్యేక బలగాల నుంచి కూడా పంజ్ షీర్ ఫైటర్లకు సైనిక సహాయం అందుతుందని చెబుతున్నారు. 1980 నుంచి 1985 వరకు ఈ లోయపై సోవియట్ ఆరుసార్లు దాడి చేసింది. భూతల దాడులతో పాటు వైమానిక దాడులు జరిపింది. అయినా ఈ లోయపై సోవియట్ పట్టు సాధించలేకపోయింది. ఇప్పుడు కూడా ఐదు సింహాల అర్థానికి తగినట్టే పంజ్‌షీర్ తాలిబాన్లపై గర్జిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: