కరోనాను ఎదుర్కొనే శక్తి ఈ ఊరుకు ఎలా వచ్చింది?

Mekala Yellaiah
కరోనాతో కలిసి జీవించడం తప్పదని ఎపిడమాలజిస్టులు ఇప్పటికే తేల్చారు. ప్రజలందరికీ వ్యాక్సిన్లు వేసినా ఆ మహమ్మారి జాడలు ఉంటాయన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఓ గ్రామం కోవిడ్ ను తట్టుకొని తిరిగి పూర్వ స్థితికి చేరింది. తెలంగాణలోని రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, దానిని నిరోధించే సామర్థ్యాన్ని పొందింది. భారతదేశంలోనే కోవిడ్ రెసీలియంట్ విలేజ్ గా కీర్తి గడించింది. విదేశాల్లో స్థిరపడిన భారత సంతతి వైద్యుల బృందం సహకారంతో ఆ గ్రామం కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొని, యథాస్థానంలో నిలబడింది. కరోనాతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న అమెరికాను చూసి అక్కడ స్థిరపడిన తెలుగు వైద్యులు రాజన్నపేటను కరోనా ఫ్రీ గ్రామంగా మార్చారు. అమెరికాలో కరోనా చికిత్స, నిర్వహణలో తమ అనుభవాలను భారతదేశానికి అందించాలనుకున్న 15 మంది వైద్యులు, తమ స్నేహితులతో కలిసి ప్రాజెక్టు మదత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి, దాని ద్వారా రాజన్నపేటలో కరోనాను తరిమేశారు. ఈ ప్రాజెక్టు మదత్ లో వైద్యనిపుణులతో పాటు మేనేజ్ మెంట్ కన్సల్టెంట్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఐక్యరాజ్య సమితిలో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు. వీరంతా కలిసి కోవిడ్ సెకండ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొని బయటపడే సామర్థ్యాన్ని కలిగిన ఒక ఆదర్శ గ్రామాన్ని తయారు చేశారు.

కరోనాపై ఉన్న అపోహలు, దుష్ప్రచారాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామపంచాయతీ, ప్రభుత్వ వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్స్ తో కలిసి పనిచేశారు. ఈ ప్రాజెక్టు మదత్ లో ఉన్న వైద్యులు గత నాలుగు నెలల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని సిరిసిల్ల, నిజామాబాద్, వరంగల్, సూర్యాపేట, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో 1500 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులకు అమెరికా నుంచి జూమ్ ద్వారా కరోనాను ఎదుర్కొనే విధానాలపై అవగాహన కల్పించారు. ఈక్రమంలో పది కరోనా కేసుల వరకు బయటపడిన రాజన్నపేట గ్రామాన్ని కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా సేవాభావంతో పనిచేస్తున్నారు. అమెరికా అనుభవాలను గ్రామస్తులతో పంచుకున్నారు. గ్రామస్తుల అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకొని, ఐదు అంచెల వ్యూహాన్ని అమలుచేసి  రాజన్నపేటలో కరోనాను తరిమికొట్టారు. గ్రామీణ వైద్య సహాయకులకు కరోనాపై అవగాహన కల్పించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. గ్రామస్తుల్లో బాధ్యతాయుతమైన కోవిడ్ నడవడికను ఏర్పరిచారు. కరోనాపై నెలకొన్న అపోహలు, దుష్ప్రచారాలపై స్థానిక భాషలో సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించారు. ఇంటి గడప వద్దనే వ్యాక్సిన్ ను అందుబాటులో ఉంచారు. కరోనా భయాన్ని పోగొట్టేందుకు మానసిక నిపుణులతో సలహాలు అందించారు. బలవర్థకమైన ఆహారం తీసుకోవడంపై అవగాహన కల్పించారు.  పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, సానిటైజర్లు, పల్స్ ఆక్సీమీటర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, సెల్ఫ్ టెస్టింగ్ కిట్లు విస్తృతంగా పంపిణీ చేశారు. 

కుల సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, వ్యాపారులకు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. గ్రామంలో విరివిగా పోస్టర్లను అంటించారు. దగ్గరలో కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు, వాటిలో సౌకర్యాల వివరాలు అందించారు. కరోనా టెస్టింగ్, వ్యాక్సినేషన్ వివరాలు అన్నీ ఒకేచోట వైద్యశాఖకు అందుబాటులో ఉండేవిధంగా మదత్ కేర్ డాట్ కామ్ రూపంలో డేటా బేస్ ను రూపొందించారు. డ్రోన్ కెమెరాలతో పరిస్థితులను పర్యవేక్షించారు. ప్రజలకు పూర్తి అవగాహన, కోవిడ్ బాధ్యతాయుతమైన నడవడిక కల్పించాక, ఇంటి వద్దకే వెళ్లి వ్యాక్సిన్లు వేశారు. గ్రామ ప్రవేశ ద్వారాల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, వేరే గ్రామాలవారు వస్తే, వారికి రాపిడ్ టెస్టులు నిర్వహించి అనుమతించారు. ఇప్పుడు రాజన్నపేట దాని అనుబంధ గ్రామం కిష్టూనాయక్ తండాలో 2253 మంది ఉండగా, అందులో 1551 మంది కరోనా టీకాకు అర్హత కలిగినవారు ఉన్నారు. వారందరికీ వ్యాక్సిన్ వేశారు. ఇప్పుడు రాజన్నపేట మోడల్ ను అధ్యయనం చేసేందుకు ఇండోర్ లోని ఐఐఎం(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్) సిద్ధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: