పవన్‌ కల్యాణ్‌.. గోల్డెన్‌ ఛాన్స్ మిస్‌ చేసుకుంటున్నాడా..?

ఏపీలో ప్రస్తుతం వైసీపీ తిరుగులేని శక్తిగా ఉంది. అలాగని అక్కడ అంతా బావుందని చెప్పలేం.. జగన్ పాలనపై అంతా సంతృప్తిగానూ ఉన్నారని చెప్పలేం.. కానీ.. జగన్ పాలనపై ఉన్న అసంతృప్తిని క్యాష్‌ చేసుకునే ప్రయత్నం సరిగ్గా జరగడం లేదు. ఎందుకంటే.. జగన్ పాలనపై అసంతృప్తి ఉన్నా.. అది ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి అనుకూలంగా మారడం లేదు. ఎందుకంటే.. మాజీ సీఎం చంద్రబాబు పార్టీ పగ్గాలు దాదాపుగా లోకేశ్‌కు అప్పగించేశారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అవకాశం ఇచ్చినా.. అది లోకేశ్‌ సీఎం అయ్యేందుకు సహకరిస్తుందన్న వాదన ఉంది.

కానీ.. లోకేశ్‌కు ఇంకా జనాదరణ కనిపించడం లేదు. జగన్‌కు ప్రత్యామ్నాయంగా లోకేశ్‌ను జనం అంగీకరించే పరిస్థితి లేదు. మరోవైపు చంద్రబాబుకు వయస్సు మీద పడుతోంది. ఇలాంటి సమయంలో సరైన ప్రత్యామ్నాయంగా నిలబడగలిగితే జనం ఆదరించే అవకాశం ఉంది. అలాంటి అవకాశం పవన్‌ కల్యాణ్ కు ఉంది. కానీ.. దాన్ని ఆయన సరిగ్గా వినియోగించుకోవడం లేదన్న వాదన కూడా ఉంది. ఏపీలో జగన్ పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఎలాగూ చివరి ఏడాది ఎన్నికల ఏడాదే అవుతుంది. అంటే ఇంకా ఎన్నికలకు సరిగ్గా రెండేళ్లే సమయం ఉన్నట్టు.

మరి ఇలాంటప్పుడు పవన్ ఎలా వ్యవహరించాలి.. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ఆయన జనంలోకి వెళ్తే జనం ఆదిరించే అవకాశం ఉంది. కానీ.. ఆ సవాల్ స్వీకరించేందుకు పవన్ ఎందుకో పూర్తిగా సిద్ధంగా లేడు. ఆయన ఇంకా పార్ట్ టైమ్ పాలిటిక్స్ పైనే ఆధారపడుతున్నాడు. మనం హీరో.. చివరి నిమిషంలో వచ్చినా మనల్ని ఆదరిస్తారన్న భ్రమలను గత ఎన్నికల్లోనే జనం తిప్పికొట్టారు. అయినా పవన్ కల్యాణ్ ఇంకా రాజకీయాలను సీరియస్‌గా తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

మరి ఇప్పటికైనా పవన్ కల్యాణ్ కదులుతారా.. ఏపీలో సమస్యలపై సోషల్ మీడియాలో కాకుండా జనం మధ్యకు వచ్చి స్పందిస్తారా.. జనం తరపున పోరాడతారా.. జగన్‌కు ప్రత్యామ్నాయంగా అవతరిస్తారా.. అంటే కాలమే సమాధానం చెప్పాలి.. ఏదేమైనా పవన్‌కు ఇది మంచి అవకాశం ఉపయోగించుకుంటే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: