బర్త్‌డే స్పెషల్: పవన్.. ఇకనైనా మేలుకుంటారా..?

పవన్ కల్యాణ్ అంటే ఓ శక్తి.. పవన్ కల్యాణ్‌ అంటే ఓ ఉత్సాహం.. ఇక అభిమానలకైతే పవన్ కల్యాణే అన్నీ.. అయితే ఆ అభిమానమే సినిమాల్లో ఆయనకు ఘన విజయాలు అందించింది. తన నటన, మేనరిజంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అల్టిమేట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ.. అదే మేజిక్ రాజకీయాల్లోనూ సాధించాలనుకున్నాడు పవన్ కల్యాణ్. అలాంటి ఆశలు ఉండటం తప్పేమీ కాదు.. వాస్తవానికి పవన్ లాంటి నిస్వార్థపరులు.. సమాజం మేలు కోరేవారు సినిమాల్లో ఉన్నా లేకున్నా రాజకీయాల్లో ఉండాలి. అప్పుడే ప్రజలకు మేలు జరగుతుంది.

దురదృష్టం ఏంటంటే.. ఏపీలో ఏ స్టార్‌కూ లేనంత ఫ్యాన్ బేస్ ఉన్న పవన్ కల్యాణ్‌.. రాజకీయాల్లో మాత్రం ఇంకా తొలి విజయం అందుకోలేదు. దాదాపు ఏడేళ్ల క్రితమే పార్టీ పెట్టినా.. ఇప్పటి వరకూ అది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. దీనికి తోడు పవన్ కల్యాణ్ తీసుకునే నిర్ణయాలు రాజకీయంగా ఆయనకు కలసిరాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తామే కింగ్‌ మేకర్ అవుతామని ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. ఆ పార్టీ నుంచి కేవలం ఒక్కరు మాత్రమే అసెంబ్లీకి వెళ్లారు. అది కూడా పవన్ కాదు.

సరే.. గతం గతహ.. మరి ఇప్పుడు పవన్ పరిస్థితి ఏంటి.. తెలంగాణలో మరో రెండేళ్లలో.. ఏపీలో మరో మూడేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఆ ఎన్నికలకైనా పవన్ పార్టీని సిద్ధం చేస్తాడా.. మరి అలా చేయాలంటే ఇప్పటి నుంచి తగిన ప్రణాళిక ఉండాలి కదా. కానీ అవేమీ ఉన్నట్టు కనిపించడం లేదు. పార్టీ పెట్టి ఏడేళ్లయినా ఇంకా ఎలాంటి ప్రభావం చూపించని జనసేన.. మరో రెండు, మూడేళ్లలోనే తగిన సత్తా చూపాలంటే.. తగిన కసరత్తు ఉండాలి. ఇటు చూస్తే పవన్ కల్యాణ్ మాత్రం ఇంకా సినీరంగం నుంచి పూర్తిగా బయటపడటం లేదు.

వాస్తవానికి ఇప్పుడు ఏపీలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందనే చెప్పాలి. ఏపీలో సీఎం జగన్‌ను వ్యతిరేకించేవారికి ఇప్పుడు ఓ నమ్మదగిన ప్లాట్‌ఫామ్ కావాలి. తెలుగు దేశం ఆ స్థాయి కోల్పోతుంది. మరి అలాంటప్పుడు పవన్ దాన్ని అందుకునే ప్రయత్నం చేస్తే కొంత వరకూ లాభించొచ్చు. కానీ పవన్ నుంచి మాత్రం అలాంటి సంకేతాలేమీ రావడం లేదు. కమాన్.. పవన్‌.. ఇకనైనా సత్తా చాటు.. హ్యాపీ బర్త్‌ డే టూ యూ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: