పట్టణ వాసులపై పన్నుపోటు..!

మీరు నగరంలో ఉంటున్నారా... పల్లె కంటే పట్నం బెటర్ అని అనుకుంటున్నారా... అయితే ఈ వార్త మీ కోసమే. సుఖంగా సాగిపోతుందనుకున్న నగర జీవిపై ఇప్పుడు కొత్త బాదుడు మొదలైంది. ఇప్పటికే ఆస్తిపన్నుతో సరిపెట్టుకున్న నగర జీవి... ఇకపై అదనంగా మరో నాలుగు రకాల పన్నులు కూడా ప్రభుత్వానికి కట్టాల్సి ఉంది. ఇక నెల జీతగాళ్లు తమ బడ్జెట్ ప్లాన్‌లో ఈ ఐదు రకాల పన్నులను కూడా చేర్చాల్సిందే మరి. ఏకంగా ఐదారు రకాల పన్నులను ఇకపై నగర వాసుల నుంచి వసూలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రభుత్వ నిర్ణయం సాధారణ ప్రజలు మొదలు... అన్ని వర్గాల వారిపై భారం కానున్నాయి. వరుస డిమాండ్ నోటీసులతో నగర వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఆస్తి పన్ను పెంచుతూ ఇప్పుడు ప్రభుత్వం గెజిట్ నోటిఫై చేసింది.  నివాస ప్రాంతాల్లోని భవనాలపై 0.13 శాతం ఆస్తి విలువ ఆధారిత పన్ను విధించనుంది ప్రభుత్వం. అలాగే నివాసేతర ప్రాంతాల్లో అంటే... వ్యాపార, వాణిజ్య ప్రాంతాల్లో మాత్రం 0.30 శాతం వసూలు చేయనున్నారు. దీంతో కేవలం రాష్ట్రంలోని నగరంల్లో నివసిస్తున్న లక్షల మందిపై అదనపు భారం పడనుంది. మరోవైపు ఈ నెలాఖరు లోపే పాత బకాయిల మొత్తాన్ని పూర్తిగా వసూలు చేయలని కూడా అధికారులు టార్గెట్ పెట్టారు.
ఇక ఇప్పుడు నీటి పన్నును కూడా ప్రభుత్వం పెంచేసింది. మీటర్లకు 24x7 కింద నీటి మీటర్లు బిగించి... వాడకం ఆధారంగా పన్ను వసూలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది ప్రభుత్వం. మీటర్ల కొనుగోలు భారం కూడా వినియోగదారులపైనే పడనుంది. కమర్షియల్, సెమీ కమర్షియల్, అపార్ట్‌మెంట్, గ్రూప్ హౌస్‌లకు నీటి మీటర్లు బిగించి... పన్ను వసూలు చేయనున్నారు అధికారులు. ఇక కొత్తగా ఇల్లు నిర్మించాలనుకునే వారికి మీటరు లేకపోతే.. కుళాయి కనెక్షన్ ఇవ్వడం లేదని అధికారులు తేల్చేశారు.
ఇక ఖాళీ స్థలానికి కూడా పన్ను వసూలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కొత్తగా ఇల్లు కట్టేందుకు పాత ఇళ్లను కూల్చేసినా సరే... వాటిపై వీఎల్‌టీ విధిస్తున్నారు. వీఎల్‌టీ రూపంలో వేల రూపాయలను నగర వాసులు కట్టాల్సిందే. ఖాళీ స్థలాన్ని యజమాని ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేసి... వెంటనే పన్ను వసూలు మొదలుపెడుతున్నారు.
ఇక ప్రస్తుత వైసీపీ సర్కార్ విధించిన చెత్త పన్ను కూడా ప్రస్తుతం నగర వాసులపై భారం కానుంది. క్షేత్రస్థాయిలో చెత్త పన్ను వసూలు బాధ్యతను ఇప్పటికే వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది ప్రభుత్వం. ప్రతి కుటుంబం నుంచి కూడా చెత్త పన్ను వసూలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో మ్యాపింగ్ జరగని కుటుంబాలను గుర్తించే పనిని వార్డు వాలంటీర్‌లకు అప్పగించారు. నివాస, వాణిజ్య సముదాయాలకు వేరువేరుగా చెత్త పన్ను వసూలు చేయనుంది ప్రభుత్వం.
వీటితో పాటు సీవరేజ్ కనెక్షన్లపై పన్ను వసూలును కూడా ప్రభుత్వం భారీగా పెంచేసింది. సీవరేజ్ పన్ను పెంపుదల ప్రతిపాదనపై సీడీఎంఏ నిర్ణయం ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. 2009 నుంచి ఉన్న పాత బకాయిలు కూడా ఈ నెలలోపు చెల్లించాలని అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అలాగే 2013 నుంచి ఏటా పెరిగిన 7 శాతం కూడా కలిపి ఇప్పుడే కట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏకంగా 13 ఏళ్ల బకాయిలను ఈ నెలలోనే చెల్లించాలంటూ అధికారులు నోటీసులు జారీ చేయడంపై నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే కరోనా కారణంగా ఆదాయం అంతంత మాత్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పన్నులు చెల్లించాలంటూ అధికారులు నోటీసులు ఇవ్వడంతో నగర వాసులు లబోదిబో అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: