ప్రపంచదేశాలపై తాలిబాన్ల ప్రభావం ఎలా ఉంటుంది?

Mekala Yellaiah
అఫ్గానిస్తాన్ ను ఆక్రమించుకున్న తరువాత కొన్ని దేశాలు అక్కడ అధికార మార్పిడిని ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మాస్కో నుంచి బీజింగ్ వరకు, బెర్లిన్ నుంచి ఇస్లామాబాద్ వరకూ వివిధ దేశాల్లో దౌత్య పరమైన చర్చలు జరుగుతున్నాయి. కాబుల్ లో వారం రోజుల క్రితం జరిగిన వరుస బాంబు పేలుళ్లతో తిరుగుబాటు బృందాలు తాలిబాన్ల పాలనకు వ్యతిరేకంగా స్పందిస్తున్నాయి. అఫ్గానిస్తాన్ లో అధికార మార్పిడి ప్రభావం ప్రపంచ దేశాలపై ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. తాలిబాన్ల ప్రభావం పొరుగు దేశమైన పాకిస్తాన్ పై అధికంగా ఉంటుంది. అఫ్గానిస్తాన్ లో జరుగుతున్న పరిణామాలు పాకిస్తాన్ కు లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య 2,400 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. పాకిస్తాన్ లో ఇప్పుడు 14 లక్షల మంది శరణార్థులు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా కూడా అంతే మంది శరణార్థులు ఉంటారని అంచనా. తాలిబాన్లతో పాకిస్తాన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారికి సహాయం చేస్తున్న విషయాన్ని పాకిస్తాన్ ఖండిస్తున్నా, 1990లో తాలిబాన్ల అధికారాన్ని ఆ దేశం గుర్తించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాతో పాటు పాకిస్తాన్ తాలిబాన్లను సమర్ధించింది. తరువాత వారితో సంబంధాలను తెంచుకుంది. ఈసారి మాత్రం తాలిబాన్లు బలాన్ని సమకూర్చుకున్నారనే భావనతో ఉంది. తాలిబాన్లు అధికారంలోకి రావడమనేది భారతదేశం ప్రభావాన్ని తగ్గించే అంశంగా పాకిస్తాన్ కు అనిపిస్తుంది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లోని జలాలాబాద్, కాందహార్ లో భారతీయ రాయబార కార్యాలయాలు ఉండడం పాకిస్తాన్ కు నచ్చడంలేదు. ఇవి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పనిచేసే తెహ్రీక్ ఏ తాలిబాన్, బలూచ్ తిరుగుబాటు బృందాలను పోషిస్తాయని పాకిస్తాన్ భావిస్తోంది. తాలిబాన్లు అధికారంలోకి రావడంతో పాకిస్తాన్ తన ప్రభావాన్ని మళ్లీ పెంచుకోవాలని చూస్తోంది. దీంతో పాటు మధ్యప్రాచ్య దేశాల ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమయ్యేందుకు అఫ్గానిస్తాన్ మీదుగా ఆర్థిక వంతెనను సృష్టించుకోవాలనుకుంటోంది. అంతేకాకుండా భద్రతతో పాటు వివిధ అంశాల్లో సహకరించేందుకు పాకిస్తాన్ తాలిబాన్లను ప్రోత్సహించవచ్చు. ఇక రష్యా కూడా తాలిబాన్ల అధికారాన్ని గుర్తించింది. పశ్చిమ దేశాల సైన్యం ఆ దేశం నుంచి పూర్తిగా వెళ్లకముందే తాలిబాన్లతో సంప్రదింపులు మొదలుపెట్టింది. అఫ్గానిస్తాన్ లో రష్యా పెద్దగా ప్రయోజనాలు లేవు. అఫ్గాన్ భూభాగం నుంచి తజికిస్తాన్ లోకి తీవ్రవాదులు చొరబడకుండా ఉండేందుకు రష్యా తన సైన్యాన్ని ఉంచింది. రష్యా ప్రభావం ఉన్న ప్రాంతాల నుంచి అమెరికా సేనలు వైదొలగడం రాష్యాకు సంతోషాన్ని కలిగిస్తోంది. మరోవైపు చైనాకు అఫ్గానిస్తాన్ లో ఆర్థిక, భద్రతకు సంబంధించిన ప్రయోజనాలు ఉన్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా వైదొలగడంతో చైనా అఫ్గానిస్తాన్ లోని గనులను ఉపయోగించుకోవాలనుకుంటోంది. మైక్రోచిప్స్, ఇతర అత్యాధునిక టెక్నాలజీ పరికరాలలో వాడే ఖనిజాలను ఉపయోగించుకోవాలని చూస్తోంది. అఫ్గానిస్తాన్ లో ఖనిజ నిల్వల విలువ సుమారు లక్ష కోట్ల డాలర్లు ఉంటుందని అమెరికా ఎప్పుడో అంచనా వేసింది. అయితే అఫ్గాన్ ప్రభుత్వం మాత్రం అంతకు మూడు రెట్లు ఉంటాయని చెప్పింది. అఫ్గాన్ పై పాశ్చాత్య దేశాలు విధించే ఆంక్షలను అంచనా వేసుకొని చైనా అడుగులు వేస్తోంది. ఇక ఇరాన్ కూడా తాలిబాన్లతో సన్నిహితంగానే ఉంటోంది. ఇరాన్ లోని సంప్రదాయ ఆయుధాలను తయారు చేస్తున్న రివల్యూషనరీ గార్డు కార్ప్స్(ఐఆర్ జీసీ)కి చెందిన కుద్స్ ఫోర్స్ ద్వారా ఇరాన్ తాలిబాన్లతో స్నేహంగా ఉంటోంది. అయితే అమెరికా ఆ బృందాన్ని తీవ్రవాద సంస్థగా పరిగణిస్తోంది. ప్రస్తుతం ఇరాన్ లో 7,80,000 మంది శరణార్థులు ఉన్నారు. అఫ్గాన్ లో సుస్థిరత నెలకొంటే ఇరాన్ కు వలసలు తగ్గుతాయి. ఏది ఏమైనా అఫ్గాన్ నేలపై తీవ్రవాదం పెరగకుండా చూస్తూ, శరణార్థుల సమస్యకు పశ్చిమ దేశాలు పరిష్కారం చూపాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: