ప్రయాణం భయానకం

Mekala Yellaiah
ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా మారాయి. ప్రధానంగా డెల్టా ప్రాంతాల్లో దారుణంగా ఉన్నాయి. అక్కడ రోడ్ల మీద ప్రయాణించాలంటే జనం నరక యాతన పడుతున్నారు. ఆర్ అండ్ బీ డిపార్ట్ మెంట్ లో వర్క్ చార్జి సిబ్బంది లేకపోవడంతోనే ఈ దుస్థితికి కారణమని చెబుతున్నారు. దీంతో పాటు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. రోడ్ల దుస్థితికి గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో పాటు వర్షం కారణమని ప్రభుత్వం చెబుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రోడ్లపై మూడు ఫీట్ల లోతు వరకు గోతులు పడ్డాయి. తాడేపల్లిగూడెం నుంచి కొయ్యలగూడెం వరకు ఉన్న రాష్ట్ర రహదారిపై పెద్దపెద్ద గుంతలు పడ్డాయి. రావులపాలెం, అమలాపురం, నిడదవోలు, పెరవలి రహదారుల్లో ఆటోలు కూడా వెళ్లడం ప్రహసనంగా మారింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ మీద కూడా గుంతలు పడ్డాయి. జొన్నాడ, రాజమహేంద్రవరం మధ్య నేషనల్ హై వే మీద రాకపోకలు కష్టంగా మారాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్ర సరిహద్దుల్లో కూడా ఇలాంటి సమస్యే ఉంది. కర్ణాటక, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోనూ, శ్రీకాళహస్తి నుంచి చెన్నై వెళ్లే రోడ్డులోనూ ఇదే దుస్థితి ఉంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో మూడోవంతు రోడ్లపై ప్రయాణం దుర్భరమైంది. గతంలో ప్రభుత్వంలో వర్క్ చార్జుడ్ ఉద్యోగులు ఉండేవారు. కాంట్రాక్టు ఉద్యోగులను కూడా నియమించేవారు. వారంతా రోడ్లపై పడిన గుంతలను పూడ్చేవారు. ఇప్పుడు ఆ ఉద్యోగులతో పాటు ఆ వ్యవస్థనే రద్దు చేశారు. రోడ్డు నిర్మించిన తరువాత పునర్నిర్మాణం వరకు దానిని పర్యవేక్షించే సిబ్బంది లేరు. రాష్ట్రంలో జాతీయ రహదారులు 14,714 కిలోమీటర్ల పొడవు ఉన్నాయి. అందులో 99 రోడ్లు బాగా శిథిలమైనట్టు రోడ్లు భవనాల శాఖ అధికారులు గుర్తించారు. రోడ్ల కోసం బడ్జెట్ లో కూడా ఎక్కువగా నిధులు కేటాయించడంలేదు. 2021-22 బడ్జెట్ లో 1.7 శాతం నిధులు మాత్రమే కేటాయించారు. ఇది వివిధ రాష్ట్రాల సగటు 4.3 శాతంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. బడ్జెట్ లో రూ.7,594 కోట్లు ప్రతిపాదించగా అవి కూడా ఖర్చు చేయడంలేదు. ప్రస్తుతం ప్రభుత్వం 8970 కిలోమీటర్ల రోడ్ల పనులకు టెండర్లు వేయగా, కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడంలేదు. 1140 పనులకు టెండర్లు పిలవగా, 400 పనులకు మాత్రమే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. రాయలసీమ మినహా మిగిలిన ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడంలేదు. గతంలో చేసిన పలు పనులకు బిల్లులు రాకపోవడంతోనే కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు మొగ్గు చూపడంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: