రాజధాని రగడకు తెరపడేదెప్పుడు..?

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదీ అంటే... ప్రస్తుతం ఏమో అనేలా  ఉంది పరిస్థితి. అవును నిజమే... తెలంగాణ రాజధాని ఏదీ అంటే హైదరాబాద్ అనేస్తారు. అలాగే తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు, ఒడిశాకు భువనేశ్వర్, మహారాష్ట్రకు ముంబై... ఇలా ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ కు మాత్రం... అసలు రాజధాని అంటే... అదేమిటీ అనేలా పరిస్థితి మారిపోయింది. అసలు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఏపీ వాసులు... మా స్టేట్ క్యాపిటల్ ఇదీ అని కూడా చెప్పలేకపోతున్నారు. ఇదే గందరగోళానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ప్రధాన కారణం.
2014లో ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన తర్వాత ఏర్పాడిన నవ్యాంధ్రకు రాజధాని లేకుండా పోయింది. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని కేంద్రం కేటాయించింది. అయితే ప్రజలు ఇక్కడ ఉంటే... పరిపాలన అక్కడ నుంచి ఎలా... అని భావించిన నాటి తెలుగుదేశం ప్రభుత్వం... విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. ఆ ప్రాంతానికి అమరావతి అని నామకరణం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ నగరాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది కూడా. ఈ నగర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన కూడా చేశారు. కొన్ని భవనాల నిర్మాణం కూడా ప్రారంభించారు. అలాగే అప్పటి వరకు శాసనసభ, సచివాలయం నిర్వహించుకునేందుకు తాత్కాలిక భవనాలు కూడా నిర్మించింది. అయితే అనూహ్యంగా 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది.
2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్... రాజధాని విషయంపై అనూహ్య నిర్ణయం తీసుకుంది. 2019 డిసెంబర్ లో జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాల్లో రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే... పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని జగన్ సూచించారు. అందులో భాగంగా పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు నగరాలను జగన్ సర్కార్ ఎంపిక చేసింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అమరావతి ప్రాంత రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కూడా. రైతులకు తెలుగుదేశం పార్టీ మద్దతుగా నిలిచింది. అయితే తన నిర్ణయంపై ఏ మాత్రం వెనక్కి తగ్గని వైఎస్ జగన్... విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తామని స్పష్టం చేశారు కూడా. ఇప్పటికీ మంత్రులు అదే మాట చెబుతున్నారు.
అయితే తాజాగా..... కేంద్ర ఇంధన శాఖ పార్లమెంట్ లో లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానం మరోసారి దుమారం రేపుతోంది. రాష్ట్రాలు, రాజధానులు అంటూ విడుదల చేసిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ పక్కనే విశాఖపట్నం అని ముద్రించింది. అసలు కేంద్ర మంత్రివర్గ ఆమోదం లేకుండా, గెజిట్ నోటిఫికేషన్ రాకుండా రాజధానిగా విశాఖను ఎలా ప్రకటిస్తారనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్న. తప్పుగా ముద్రించామని కేంద్ర ఇంధన శాఖ వివరణ ఇచ్చినప్పటికీ... ఈ ప్రకటన మాత్రం... ప్రస్తుతం వైసీపీ నేతలకు మరింత బలం ఇస్తోంది. ఈ నేపథ్యంలో అసలు రాజధాని రగడకు తెర పడేది ఎప్పుడు అంటూ అంతా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: