ఏపీ రాజధాని వైజాగ్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..?

తెలంగాణ రాజధాని అంటే హైదరాబాద్ అని చెప్పేస్తారు. తమిళనాడు అంటే చెన్నై... కర్ణాటక అంటే బెంగళూరు... మరి ఆంధ్రప్రదేశ్ అంటే... అదేదో సినిమాలో చెప్పినట్లు... అప్పట్లో అమరావతి... ఇప్పుడు విశాఖపట్నం. అదేమిటీ అంటే... అవుననేలా ఉంది పరిస్థితి. రాష్ట్ర రాజధానిగా  అమరావతి నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేస్తే... అభివృద్ధి, పరిపాలన వికేంద్రికరణ కావాలంటే ఒక రాజధాని కాదు... మూడు రాజధానులు ఉండాల్సిందే అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అప్పటి నుంచి అసలు రాష్ట్రానికి రాజధాని నగరం ఏదో అర్థం కావడం లేదు. తెలుగుదేశం పార్టీ నేతలేమో అమరావతి అంటారు.. వైసీపీ నేతలేమో విశాఖపట్నం అంటారు. ప్రస్తుతం ఈ బాల్ కేంద్రం కోర్టులో ఉంది.
అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కాదని వైజాగ్ ను కేంద్రం ఆమోదించిందా అంటే... అవుననే అనిపిస్తోంది. అసలు ఈ అనుమానం రావడానికి ప్రధాన కారణం పార్లమెంట్ లో కేరళ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానమే. పెట్రోల్, డీజిల్ ధరలపై కేరళ ఎంపీ పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. అందులో రాష్ట్రం పేరు, రాజధానుల్లో ఉన్న ధరలు అంటూ సవివరంగా జవాబు చెప్పింది కేంద్రం. ఈ జాబితాలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు పక్కన రాజధానిగా వైజాగ్ అని రాసి.. అక్కడ ధరలు ఇలా ఉన్నాయంటూ వెల్లడించింది.
కాంగ్రెస్ ఎంపీ కుంభకుడి సుధాకరన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఇంధన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ జులై 26న జవాబిచ్చారు. 2020, 2021లో ధరల వివరాలు ఇలా ఉన్నాయంటూ... లిఖిత పూర్వకంగా వెల్లడించారు. అసలు కేంద్ర మంత్రి వర్గ ఆమోదం, గెజిట్ నోటిఫికేషన్ లాంటివి ఏవీ లేకుండానే లోక్ సభకు ఇచ్చిన జవాబులో రాజధానుల జాబితాలో వైజాగ్ పేరును ఎలా ప్రకటిస్తారు అనేది ప్రస్తుతం అందరి మదిలో ఉన్న ప్రశ్న. దాదాపు నెల రోజుల క్రితం ఈ జాబితా బయటకు వచ్చినా కూడా... ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గానీ, అధికార పార్టీ నేతలు కానీ, ప్రతిపక్ష సభ్యులు కానీ ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లలేదు. అటు ఇదుగో కేంద్రం గుర్తించేసింది అంటూ వైసీపీ నేతలు కూడా రాష్ట్రంలో ఎక్కడా ప్రకటించలేదు. పోనీ లోక్ సభలోని రాష్ట్రాల రాజధానుల జాబితాలో ఏపీ రాజధానిగా వైజాగ్ పేరు నమోదు అయ్యి ఉంటే... ఈ ప్రక్రియ ఎప్పుడు జరిగిందో తెలియాల్సి ఉంది. లోక్ సభ అధికారిక వెబ్ సైట్ లో కాంగ్రెస్ ఎంపీ అడిగిన ప్రశ్నతో పాటు... జవాబు ప్రతి కూడా జతచేసి అప్ లోడ్ చేశారు.
https://164.100.24.220/loksabhaquestions/annex/176/AS84.pdf

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: