బాబూ..! జగన్ చేసిన పాపం ఏంటి.. మోడీ చేసిన పుణ్యమేంటి..?

ప్రతిపక్షం అంటే నిత్యం ప్రజల పక్షం ఉండాలి. ప్రజాసమస్యలపై పోరాడాలి.. అధికారంలో ఉన్న పార్టీని నిలదీయాలి.. ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేలా పాలకులపై ఒత్తిడి తీసుకురావాలి.. ఈ విషయాలన్నీ గతంలోనే పదేళ్లపాటు ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబుకు.. మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షనేతగా కొనసాగుతున్న చంద్రబాబుకు తెలియనివేమీ కాదు. అందుకే ఆయన నిత్యం ప్రజాసమస్యలపై స్పందిస్తుంటారు. నిరసన కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొన్నా పాల్గొనకపోయినా సోషల్ మీడియాలో చాలా చురుకుగా స్పందిస్తుంటారు.

ఇప్పుడు కూడా తెలుగు దేశం అదే చేసింది. పెట్రోల్ ధరలపై రాష్ట్రవ్యాప్తంగా తెలుగు దేశం శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి.  పెట్రోల్, డీజీల్ ధరల పెరుగుదలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ అనేక చోట్ల ధర్నాలు నిర్వహించింది. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ కు 30 రూపాయలు తగ్గించాలని తెలుగు దేశం నేతలు డిమాండ్ చేశారు. అంతే కాదు.. వైసీపీ ప్రభుత్వం వల్లే ఏపీలో ధరలు అధికంగా ఉన్నాయని విమర్శించారు. వైసీపీ తీరు వల్లే పెట్రోల్ వంద రూపాయలకు చేరిందని మండిపడ్డారు.

తెలుగు దేశం నేతల ఆందోళనల్లోనూ.. విమర్శల్లోనూ ఎక్కడా తప్పులేదు.. ఈ విధంగా ప్రభుత్వాన్ని నిలదీయవలసిందే.. కడిగేయవలసిందే. అయితే ఇక్కడే ఓ చిన్న లాజిక్‌ టీడీపీ మరిచిపోతోంది. అంటే మరిచిపోతోందని కాదు.. కావాలనే నిర్లక్ష్యం చేస్తోంది. పెట్రోల్ ధరల పెంపు విషయంలో రాష్ట్రం పాత్ర ఎంతో.. అంత కంటే ఎక్కువ కేంద్రం పాత్ర ఉంటుంది. కేంద్రం అనుమతి ఇవ్వకుండా ఆయిల్ సంస్థలు అంతగా రేట్లు పెంచేయవు. మరి అలాంటప్పుడు తెలుగు దేశం నేతలు కేంద్రాని కూడా తిట్టాలి కదా.. మోడీ సర్కారు చేతగాని తనం వల్లే ధరలు పెరిగాయి అని అనాలి కదా.


కానీ.. ఏ ఒక్క నాయకుడూ మోడీని తప్పుబట్టినట్టు వార్తలు అయితే ఇంత వరకూ కనిపించడం లేదు. ఎవరో ఊరూపేరూలేని నాయకులు అంటే అన్నారేమో కానీ.. ప్రధాన నేతలెవరూ మోడీని కానీ.. ఆయన ప్రభుత్వాన్ని కానీ విమర్శించడం లేదు. మరి ఇంతకీ జగన్ చేసుకున్న పాపం ఏంటి.. మోడీ చేసుకున్న పుణ్యం ఏంటో.. ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: