కేసీఆర్‌ అంతే: నచ్చితే మల్లారెడ్డి.. నచ్చకపోతే ఈటల..?

తెలంగాణ సీఎం కేసీఆర్‌ రూటే సెపరేటు.. ఆయన ఎప్పుడు ఎవరిని నెత్తిన పెట్టుకుంటారో.. ఎప్పుడు ఎవరిని పాతాళానికి తొక్కేస్తారో ఎవరూ చెప్పలేరు.. సొంత పార్టీ టీఆర్ఎస్ వాళ్లకు సైతం అర్థం కాదు.. ఆయన మూడ్ ఎవరికీ అర్థం కాదు.. ఎందుకంటే.. కొన్నాళ్ల క్రితం ఆయన సొంత మంత్రి ఈటల రాజేందర్‌ను టార్గెట్ చేశారు.. ఎందుకంటే.. ఆయన భూ అక్రమాలకు పాల్పడ్డారని తేల్చారు. దానిపై ఆఘమేఘాలపై విచారణ కమిటీ వేశారు. కొందరు రైతులు సీఎంకు ఓ లేఖ రాస్తే దానిపై అప్పటికప్పుడు విచారణ కమిటీ వేశారు. 24 గంటల్లో విచారణ జరిపించారు.

అంతేనా.. ఆయన ఆలయ భూములు ఆక్రమించారని మరో ఆరోపణ.. విచిత్రం ఏంటంటే.. ఈ భూవివాదాలపై ఈటల చాలా క్లియర్‌గా చెప్పారు. అసైన్డ్ రైతులతో ఒప్పందం చేసుకునే భూములు తీసుకున్నానన్నారు. ఇక ఆలయ భూములు విషయం కూడా ప్రభుత్వానికి చెప్పానని తేల్చారు. ఉంటే గింటే నిబంధనల ఉల్లంఘన ఉండొచ్చేమో కానీ.. అవి అక్రమాలు కావు.. విచిత్రం ఏంటంటే.. ఆ మాత్రం దానికే సీఎం కేసీఆర్ ఈటలను మంత్రి పదవి నుంచి తొలగించారు. మొత్తానికి ఈటలను టార్గెట్ చేశారు. ఆ సమయంలోనే ఆయన అవినీతిని సహించేది లేదని ప్రకటన చేశారు.

విచిత్రం ఏంటంటే.. ఇప్పుడు అదే తన మంత్రి వర్గంలోని మరో మంత్రి మల్లారెడ్డిపై భూవివాదాలు వస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొన్ని ఆధారాలు కూడా బయటపెట్టారు. ఈటల అనుభవం ప్రకారం అయితే.. సీఎం కేసీఆర్.. మల్లారెడ్డిపైనా విచారణ కమిటీ వేయించాల్సి ఉంది. అక్రమాలు జరిగాయా లేదా అన్నది తేల్చాల్సి ఉంది. కానీ.. అలాంటిదేమీ జరగడం లేదు. అంతే కాదుపైగా అదే మంత్రి తెలంగాణ భవన్‌ సాక్షిగా తొడగొట్టి సవాల్ విసురుతున్నారు.

అంతేనే.. సాక్షాత్తూ కేటీఆరే మల్లారెడ్డిని వెనకేసుకొస్తూ మాట్లాడారు. దీన్నిబట్టి ఏం అర్థమవుతోంది.. కేసీఆర్‌కు నచ్చితే అంతే.. మల్లారెడ్డి లాంటి ట్రీట్‌మెంట్‌ జరుగుతుంది. నచ్చకపోతే.. ఈటల మార్క్ ట్రీట్‌మెంట్‌ జరుగుతుంది. అది సరే.. మరి ఈటల అక్రమాలపై చర్యలు ఎంతవరకూ వచ్చాయన్నది మాత్రం తెలియడం లేదు. ఈటల బీజేపీలోకి చేరడంతోనే చర్యలు ఆగిపోయాయన్న వాదన వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: