రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ పాలిట విలన్‌గా మారారా..?

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. రాజకీయాల్లో ఇప్పుడు మహా జోరు మీద ఉన్నారు. గతంలోనూ రేవంత్ రెడ్డి దూకుడుగానే ఉండేవారు. అయితే.. గతంలో ఎంత దూకుడుగా ఉన్నా.. ఆయనకు పార్టీల నుంచి పరిమితులు ఉండేవి. ఇప్పుడు ఏకంగా తానే పీసీసీ ప్రెసిడెంట్ కావడంతో ఆ దూకుడు మరింత పెరిగింది. అయితే ఆయన దూకుడు అంతా పొలిటికల్‌గానే ఉండేది. అయితే తాజాగా ఆయన తెలుగు సినీపరిశ్రమ పాలిట విలన్‌గా మారారు. ఓ రాజకీయ నాయకుడు సినిమా రంగానికి విలన్‌గా మారాడు అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది కదా.

కానీ.. రేవంత్ రెడ్డి విషయంలో అదే జరిగింది. ఈ విషయాన్ని కూడా ఆయన స్వయంగా తానే చెప్పుకున్నారు. ఒకప్పుడు టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు... దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మొదట ఈ వార్త వచ్చినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈడీ ఎందుకు ఈ విషయంలో జోక్యం చేసుకుంటోంది? అసలు.. డ్రగ్స్ కేసుకూ ఈడీకీ సంబంధం ఏంటి..? అనుకున్నారు. కానీ.. అసలు విషయం ఏంటో తాజాగా రేవంత్ రెడ్డే బయటపెట్టారు.

ఇప్పుడు ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు పిలవడానికి తానే కారణమని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు. ఈ విషయాన్ని మీడియా ఫోకస్ చేయడం లేదని.. కానీ.. అసలు తన వల్లే మరోసారి ఈడీ ఈ విషయంపై దృష్టి సారించిందని అంటున్నారు. ఇంతకీ అసలేమైందంటే.. నాలుగేళ్ల క్రితం టాలీవుడ్ డ్రగ్స్‌ కేసును అప్పట్లో ప్రభుత్వం సీరియస్‌గానే తీసుకుంది. అందులోనూ రవితేజ, రాణా, పూరీ జగన్నాథ్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి ప్రముఖుల పేర్లు ఉండటంతో విచారణపై ఆసక్తి పెరిగింది.

అయితే.. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని పూర్తిగా వదిలేసింది. అయితే ఈ విషయంపై నిగ్గు తేల్చాలని తాను హైకోర్టులో పిల్ వేశానని రేవంత్ రెడ్డి అంటున్నారు. తన పిల్ కారణంగానే ఈడీ, సీబీఐ రంగంలోకి దిగాయంటున్నారు. దీనిపై సిట్ విచారణ వివరాలు తమకు ఇస్తే తాము విచారణ చేస్తామని తెలంగాణను కోరాయట. అందుకే తెలంగాణ సర్కారు ముందుకురాలేదని.. అందుకే ఈడీ, సీబీఐ హైకోర్టును ఆశ్రయించి ఇప్పుడు విచారణకు సిద్ధమయ్యాయట. అలా మొత్తానికి రేవంత్ రెడ్డి టాలీవుడ్‌లో కొందరి పాలిట విలన్ అయ్యారన్నమాట.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: