వాళ్లు పలకరిస్తేనే... మనకు తెలుస్తుందా..?

తెలుగుదేశం పార్టీ నేతలకు కాస్త ఆలస్యంగా ఆలోచనలు వస్తాయేమో మరి. పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన, ప్రజా క్షేత్రంలో పోరాటంపైన, పథకాల ప్రకటన... ఇలా ఏ అంశం చూసినా కూడా ముందుగా ఇతర పార్టీ నేతలు ప్రకటించిన తర్వాతే... తెలుగుదేశం పార్టీ కూడా ప్రకటిస్తుంది. ఇందుకు ఉదాహరణ... ఉచిత విద్యుత్ అంశం, అమ్మ ఒడి పథకం. 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు వ్యవసాయం కోసం ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటిస్తే... ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్న టీడీపీ నేతలు... ఆ తర్వాత 2009లో అదే ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తామన్నారు. ఇక 2019 ఎన్నికల మేనిఫేస్టోలో అమ్మ ఒడి పథకం కింద 15 వేల రూపాయలు ఇస్తామని వైసీపీ ప్రకటిస్తే... తెలుగుదేశం పార్టీ ఏకంగా 18 వేల 500 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. అయినా సరే పెద్దగా ఫలితం రాలేదు.
ఇప్పుడు కూడా ఎవరో ముందుకు అడుగు వేస్తే తప్ప... తెలుగుదేశం పార్టీ నేతలు కదలడం లేదు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ముందు బీజేపీ నేతలు విమర్శిస్తే... ఆ తర్వాత పరామర్శలంటూ టీడీపీ నేతలు కదిలారు. విశాఖ గ్యాస్ లీక్ బాధితులను కూడా ముందు బీజేపీ నేతలే పరామర్శించారు. ఆ తర్వాతే అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి వస్తా అంటూ హడావుడి చేశారు. ఇక ఇసుక అక్రమ రవాణా, ధరల పెంపు, పన్నుల విధింపు... ఇలా ఏ అంశమైనా సరే... ఇతర పార్టీ నేతలు ధర్నాలు, ఆందోళనలు చేసిన తర్వాతే... ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి గుర్తుకు వస్తున్నాయి. ఇప్పుడు సొంత పార్టీ నేత విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.
అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూను పరామర్శించే విషయంలో టీడీపీ నేతలు వెనుకబడ్డారు. జ్యోతుల నెహ్రూను ముందుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వైసీపీ ఎమ్మెల్యేలు స్వయంగా పరామర్శించారు. ఇక మరో మంత్రి అయితే... వీడియో కాల్ చేసి ఎలా ఉన్నావు నెహ్రూ అన్న అంటూ ఆప్యాయంగా పలకరించారు. ఇంక అంతే... అప్పుడే మెలుకువ వచ్చినట్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆసుపత్రికి క్యూ కట్టారు. ముందుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసుపత్రికి వెళ్లి నెహ్రూను పరామర్శించారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి మరీ ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. పైగా ఆయనతో నాకు 40 ఏళ్ల అనుబంధం అంటూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.
ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒకటే టాపిక్. హైదరాబాద్ లోనే చికిత్స పొందుతున్న సొంత పార్టీ నేతను పరామర్శంచేందుకు... హైదరాబాద్ లోనే ఉంటున్న చంద్రబాబు నాయుడుకు ఇన్ని రోజులు పట్టిందా అని. పైగా 40 ఏళ్ల అనుబంధం అంటున్నారు కదా... మరి అంతటి సీనియర్ నేత, సహచరుడి ఆరోగ్యం బాగలేకపోతే... అధినేతకు ఇంత ఆలస్యంగా సమాచారం అందుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఓ వైపు భవిష్యత్తు ప్రణాళికల్లో ఆరితేరిన చంద్రబాబు... ఇలాంటి విషయాల్లో మాత్రం ఎందుకు ఇంత అలసత్వం వహిస్తున్నారో అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి విషయాల్లో చంద్రబాబు అండ్ కో అప్ డేట్ అవ్వాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: